Congress: జూబ్లీహిల్స్ నియోజకవర్గ వాసులకు, తెలుగు సినీ పరిశ్రమ స్నేహితులకు ఓ ప్రకటన విడుదలైంది. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ (Congress) కృషిని, గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమ ఎదుర్కొన్న సవాళ్లను, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ ప్రకటన ప్రముఖంగా ప్రస్తావించింది.
తెలుగు సినిమాకు కాంగ్రెస్ అండ
మన తెలుగు చలనచిత్ర పరిశ్రమను అగ్రస్థానానికి చేర్చడంలో కాంగ్రెస్ పార్టీ పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఈ ప్రకటన తెలిపింది. తమిళనాడు ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న రోజుల్లో హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు లేని సమయంలో, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌ను తెలుగు సినిమా రాజధానిగా నిలబెట్టిందని పేర్కొంది. వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలు అనేక ఎకరాల భూమిని కేటాయించి, ఫిల్మ్ స్టూడియోల ఏర్పాటుకు మార్గం సుగమం చేశాయని గుర్తు చేసింది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్‌కు ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా ప్రకటించిన బీసీసీఐ!
గత పాలనలో సినిమా పరిశ్రమపై ‘వేధింపులు’
దురదృష్టవశాత్తు కేసీఆర్-కేటీఆర్ ప్రభుత్వ హయాంలో సినిమా పరిశ్రమను చూరగొనే ప్రయత్నాలు జరిగాయని ఈ ప్రకటన ఆరోపించింది. ‘ఎక్స్‌టార్షన్, బ్లాక్‌మెయిలింగ్’ వారి రాజకీయాల్లో భాగమయ్యాయని, నటుల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, నటీమణులను వేధించడం వంటివి నిత్యకృత్యమయ్యాయని సంచలన ఆరోపణలు చేసింది. చిన్న నటుల నుండి పెద్ద దర్శకుల వరకు అందరిలోనూ భయం, భీతి నెలకొన్నాయని, కొత్త సినిమా రిలీజ్ కోసం ఫామ్‌హౌస్‌లో కమిషన్లపై బేరం జరిగేదని విమర్శించింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పరిశ్రమకు కొత్త ఊపిరి
ఆ దుష్చక్రాన్ని అంతం చేసి, సినీ పరిశ్రమకు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పరిశ్రమలోని నటులు, నిర్మాతలు అందరికీ నమ్మకం తిరిగి వచ్చిందని పేర్కొంది. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారని, ఇటీవలే చిన్న కళాకారుల పారితోషికం సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపింది. అలాగే కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ‘గద్దర్ సినీ అవార్డులు’ ప్రారంభించడం జరిగిందని తెలియజేసింది.