Movie Theaters : ఇటీవల తెలంగాణలో థియేటర్స్ బంద్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలేవీ లేకపోవడం, ప్రేక్షకులు ఎవరూ థియేటర్స్ కి రాకపోవడం, సమ్మర్, ఐపీఎల్, ఎన్నికల నేపథ్యంలో సినిమాలకు వచ్చే జనాలు తగ్గిపోయారని ఇందువల్ల కనీస వసూళ్లు కూడా రావట్లేదని తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ దాదాపు 10
రోజులు థియేటర్స్ మూసేస్తున్నట్టు పలువురు థియేటర్స్ ఓనర్స్ తెలిపారు. దీంతో కొన్ని రోజులు థియేటర్స్ బంద్ అని వార్తలు వచ్చాయి.
పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఇటీవల చిన్న సినిమాలు వరుసగా థియేటర్స్ కి క్యూ కట్టాయి. కానీ థియేటర్స్ బంద్ అని చెప్పడంతో వాటికి నష్టమే అని నిర్మాతల మండలిని ఆశ్రయించాయి. అయితే థియేటర్స్ ఓనర్స్ ఎవరూ సినీ పరిశ్రమలో ఎవర్ని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని ఇటీవల పలువురు సినీ ప్రముఖులు అన్నారు. తాజాగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ దీనిపై క్లారిటీ ఇస్తూ ఓ అధికారిక లేఖను విడుదల చేసింది.
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తమ లేఖలో.. గుంటూరుతో పాటు ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో సినిమా థియేటర్ల యజమానులు గత కొన్ని నెలలుగా తగిన ఆదాయం లేకపోవడంతో, డిజిటల్ ప్రొవైడర్లకు (UFO, Qube) ఛార్జీలు కూడా చెల్లించలేకపోవడంతో తమ సినిమా థియేటర్లను మూసివేసినట్లు మా దృష్టికి వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా కొన్ని సినిమా థియేటర్ల యజమానులు తమ ఇష్టంతోనే ప్రేక్షకులు లేరని థియేటర్స్ ని మూసేసారు. ఎన్నికలు, IPL, ఎండలు బాగా ఎక్కువగా ఉండటం వాళ్ళ ప్రేక్షకులు తగ్గారు. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలికి సంబంధం లేకుండా, ఒక సంఘం సినిమా థియేటర్లను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాము. సోషల్ మీడియా, డిజిటల్, ప్రింట్ మీడియాలో సినిమా థియేటర్ల మూసివేతకు వచ్చిన వార్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఏ గ్రూప్ గాని సినిమా థియేటర్ యజమానులు లేదా మరే ఇతర అసోసియేషన్ నుండి గాని మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. కాబట్టి థియేటర్ల బంద్ ఫేక్ అని తెలియచేస్తున్నాము. ఇది కేవలం కొంతమంది వసూళ్లు రావట్లేదని వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం మాత్రమే. థియేటర్ల మూసివేతకు సంబంధించి తెలుగు పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాము అని తెలిపారు.
థియేటర్ల మూసివేతతో ఈ వారం సినిమాలు వాయిదా పడ్డ వచ్చే వారం సినిమాలు అయినా థియేటర్స్ లో సందడి చేస్తాయేమో చూడాలి.
Also Read : Nani : నాని, సుజిత్ సినిమా ఆగిపోలేదట.. మరో నిర్మాత చేతిలోకి..