Site icon HashtagU Telugu

Tollywood : మా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు

Film Workers

Film Workers

Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు , నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం మళ్లీ భగ్గుమంది. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు, పనితీరు నియమాలు, సినీ కార్మికుల హక్కులపై జరుగుతున్న చర్చలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో, హైదరాబాద్‌లోని ఫెడరేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సినీ కార్మికుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నిర్మాతల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, “నిర్మాతలు తమకు నచ్చిన సమయాల్లో, తమకు నచ్చిన వారితోనే పని చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాల్‌షీట్లు కూడా తమ ఇష్టానుసారం ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు, కొందరు నిర్మాతలు మా కార్మికుల నైపుణ్యాలను తగ్గించిపారేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది పూర్తిగా అన్యాయం” అని మండిపడ్డారు. అతను ఇంకా మాట్లాడుతూ, “మేము పాత రూల్స్ ప్రకారమే పని చేస్తామని స్పష్టం చేశాం. కానీ, నిర్మాతలు డాన్స్ ఫైటర్స్, కొన్ని విభాగాల టెక్నీషియన్లకు మాత్రమే వేతన పెంపు ఇస్తామని చెబుతున్నారు. 24 క్రాఫ్ట్స్‌లోంచి కొన్ని విభాగాలను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సినీ కుటుంబంలో విభజన సృష్టించే ప్రయత్నం” అని ఆరోపించారు.

Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి

ఫెడరేషన్ అధ్యక్షుడు నిర్మాతల మనస్తత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “కార్మికులు కడుపు కాలితే వాళ్లే తిరిగి వస్తారని అనుకోవడం అవమానకరం. వేతనాల పెంపు విషయంలో మాత్రం నిర్మాతలకు ‘స్కిల్స్’ గుర్తొస్తాయా? రోజువారీ కష్టపడి పని చేసే మనుషుల గౌరవం కూడా కాపాడాలని నిర్మాతలు గుర్తించాలి” అని అన్నారు. అనిల్ వల్లభనేని అందరు సినీ కార్మిక సంఘాలకు స్పష్టమైన పిలుపునిచ్చారు – “నిర్మాతల బుట్టలో ఏ కార్మిక సంఘం పడకూడదు. అందరం ఐక్యతగా కలిసి పోరాడాలి.

ఇకపై ఏ షూటింగ్స్ జరగవు. నిర్మాతలు ఈ సమస్యను పరిష్కరించకపోతే రెండు మూడు రోజుల్లోనే అన్ని సంఘాలు కలిసి ఫిల్మ్ ఛాంబర్‌ను ముట్టడిస్తాయి” అని హెచ్చరించారు. “నిర్మాత విశ్వప్రసాద్ మాకు నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావడం లేదు. మేము ‘పీపుల్స్ మీడియా’కి చేసిన పనికి రూ.90 లక్షల బకాయి ఉంది. ఈ బకాయిలను చెల్లించకుండా, వేతనాల పెంపు విషయాన్ని పెద్ద సమస్యగా చూపించడం విచిత్రం. మేము ఛాంబర్‌తోనే మాట్లాడతాం” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. “మా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్మికుల పక్షాన నిలబడ్డారు. చిరంజీవి కూడా సమస్యను ఛాంబర్‌తో చర్చించాలని సూచించారు” అని తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం పరిష్కారం వైపు కాకుండా మరింత ముదురుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో క్లారిటీ రాకపోతే, తెలుగు సినీ పరిశ్రమలో షూటింగ్‌ల పూర్తి బంద్ జరగే అవకాశం ఉంది.
World Lion Day 2025 : సింహాలు ప్రతిరోజు ఎన్ని కేజీల మాంసం తింటాయో తెలుసా..?