TS High Court : అల్లు అర్జున్ ఘటనతో తెలంగాణలో సినిమా థియేటర్స్ మీద ఆంక్షలు ఎక్కువైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదహారేళ్ల లోపు పిల్లల్ని రాత్రి 11 తర్వాత, ఉదయం 11 లోపు థియేటర్లలోకి అనుమతించకూడదు అని గతంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీలు దాఖలు చేసింది మల్టీప్లెక్స్ యాజమాన్యాల సంఘం.
తాజాగా దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కొత్త తీర్పుని వెలువరించింది. థియేటర్లలోకి పిల్లల ప్రవేశంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టపోతుందన్న పిటిషనర్ల వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకొని 16 సంవత్సరాల లోపు పిల్లల్ని అన్నీ షో లకు అనుమతించాలని సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు మాత్రం గతంలో లాగే అనుమతి నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించి కేసు తదుపరి విచారణ మార్చి 17కి వాయిదా వేసింది హైకోర్టు. ఈ అనుమతి కేవలం మల్టిప్లెక్స్ లకు మాత్రమే అని తెలుస్తుంది. దీంతో మల్టీప్లెక్స్ లకు ఊరట లభించింది. సింగిల్ థియేటర్స్ కి గతంలో ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయని తెలుస్తుంది.