Bharathi Raja : తమిళ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఇకపై మీడియాకు, యూట్యూబ్ ఛానల్స్‌కి నో ఎంట్రీ..

ఇలాంటి సంఘటనలు జరగకుండా తమిళ నిర్మాతల యాక్టివ్ సంఘం(Tamil Film Active Producers Association) అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

  • Written By:
  • Publish Date - September 22, 2023 / 07:32 AM IST

పలువురు సినీ ప్రముఖులు, వారి ఇళ్లలోని వ్యక్తులు చనిపోతే పలువురు ప్రముఖులు వచ్చి నివాళులు అర్పిస్తారు. దీంతో మీడియా(Media), యూట్యూబ్ ఛానల్స్(YouTube Channels) వారి ఇంటి వద్దకు వచ్చి హంగామా చేస్తాయి. వారి వీడియోల కోసం పోటీ పడతాయి. ఇక వాటిల్లో చిన్న పాయింట్ ని తీసుకొని ఇష్టమొచ్చినట్టు థంబ్ నెయిల్స్ పెడతారు. తాజాగా విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యపై కూడా ఇలాగే పలు తప్పుడు థంబ్ నెయిల్స్ తో వీడియోలు అప్లోడ్ చేయడంతో తమిళ నిర్మాతల మండలి సీరియస్ అయింది.

ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా తమిళ నిర్మాతల యాక్టివ్ సంఘం(Tamil Film Active Producers Association) అధికారికంగా ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రసిడెంట్ భారతీ రాజా(Bharathi Raja) ఈ నిర్ణయం తీసుకొని చెప్పినట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం ఏంటంటే.. ఇకపై తమిళ సినీ ప్రముఖుల ఇళ్లల్లో కానీ, తమిళ ప్రముఖులు ఎవరైనా కానీ మరణిస్తే ఆ ప్రదేశానికి, వారి ఇంటికి మీడియాకు, యూట్యూబ్ ఛానల్స్ కి అనుమతి లేదు. పలువురు మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ప్రముఖులు మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టారు. వారు బాధలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి వీడియోల కోసం ఎగబడ్డారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ బాధ కుటుంబానికే తెలుస్తుంది. అలాంటి సమయంలో మీడియాకు సంబంధం ఏంటి. పోలీసుల అనుమతి ఉన్నా ఇకపై చనిపోయిన వారి ఇంటివద్ద ఎలాంటి మీడియాకు అనుమతి ఉండబోదు. కుటుంబ బంధాలకు విలువనిచ్చే సమాజంలో ఈ నిర్ణయాన్ని మీడియా గౌరవించాలి అని తెలుపుతూ ఒక అధికారిక లేఖని విడుదల చేశారు.

అయితే దీనిపై ఏ మీడియా కానీ, ఏ యూట్యూబ్ ఛానల్స్ కానీ స్పందించలేదు. అభిమానులు, నెటిజన్లు మాత్రం ఇది సరైన నిర్ణయమే అని భావిస్తున్నారు. వేరే పరిశ్రమలలో కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నారు.

 

Also Read : Vijay Antony : తనతో పాటే నేనూ చనిపోయాను.. కూతురు ఆత్మహత్యపై స్పందించిన విజయ్ ఆంటోనీ..