సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు, జట్టు పట్ల చూపే అంకితభావం ఆమెకు ‘కావ్య పాప’ అనే ముద్దుపేరును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారం కొత్తదేమీ కాదు. గత ఏడాది నుంచే కావ్య, అనిరుధ్ మధ్య సాన్నిహిత్యం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. న్యూయార్క్‌లో ఇద్దరూ కలిసి కనిపించారనే వార్తలతో వీరి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అయితే, ఇప్పుడు ఈ పెళ్లి ప్రచారం మరోసారి మరింత బలంగా తెరపైకి వచ్చింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారని తెలుస్తోంది. అంతేకాదు విదేశాల్లో వీరి వివాహం జరిపి, ఆ తర్వాత చెన్నైలో స్నేహితులు, సినీ ప్రముఖుల కోసం ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని కూడా సమాచారం. అనిరుధ్‌కు కుటుంబపరంగా సంబంధం ఉన్న కొందరు సినీ ప్రముఖులు ఈ పెళ్లికి మధ్యవర్తిత్వం వహించారనే కథనాలు కూడా తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి.
అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు అటు కావ్య మారన్ కుటుంబం నుంచి గానీ, ఇటు అనిరుధ్ వైపు నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కావ్య కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థల్లో అనిరుధ్ వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తమ కెరీర్‌లలో అత్యంత బిజీగా ఉన్నారు. అనిరుధ్ పాన్ ఇండియా చిత్రాలతో దూసుకుపోతుండగా, కావ్య మారన్ క్రీడా, వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంలో నిజమెంత? ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానమేనా? లేక త్వరలోనే అధికారిక ప్రకటన రానుందా? అనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
