పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో మార్షల్ ఆర్ట్స్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నాన్‌చాక్‌తో ఆయన చేసే విన్యాసాలకు అభిమానులు ఫిదా అవుతారు. అయితే, ఇప్పుడు ఆయన నటించిన ‘ఓజీ’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రీయా రెడ్డి తన యుద్ధ విద్యల నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆమె ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ‘ఫీమేల్ ఓజీ’ అంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
ఒక పాత్ర కోసం ఎంతైనా కష్టపడే తత్వం శ్రీయా రెడ్డి సొంతం. కేవలం నటనకే పరిమితం కాకుండా అత్యంత కఠినమైన ప్రాచీన యుద్ధ విద్య కలరిపయట్టులో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ విద్యలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా భావించే ‘ఉరిమి’ని అలవోకగా తిప్పుతూ ఆమె చేస్తున్న విన్యాసాలు చూసి అందరూ అబ్బురపడుతున్నారు. ఆమె వేగం, ఏకాగ్రత చూస్తుంటే నిజంగానే ఓ యుద్ధ వీరనారిలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆమె అంకితభావం, నటన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. షూటింగ్ సమయంలో శ్రీయా రెడ్డి పనితీరును గమనించిన పవన్, ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారని సమాచారం. భవిష్యత్తులో మరోసారి కలిసి పనిచేయాలని ఉందని ఆయన చెప్పినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా తన సహనటుల గురించి పవన్ బహిరంగంగా మెచ్చుకోవడం చాలా అరుదని, అలాంటిది శ్రీయా రెడ్డిని ప్రశంసించడం ఆమె ప్రతిభకు నిదర్శనమని అభిమానులు అంటున్నారు.
శ్రీయా రెడ్డి కెరీర్‌ను పరిశీలిస్తే.. ఆమె ఎప్పుడూ విభిన్నమైన పాత్రలనే ఎంచుకున్నారు. ‘పొగరు’ సినిమాలో ఆమె పోషించిన నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది. ఇటీవల ‘సుఝల్’ వెబ్ సిరీస్‌లోనూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రభాస్ నటించిన ‘సలార్ పార్ట్ 1’లో రాధా రమ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’లో కూడా ఆమె కీలక పాత్రలో నటించనున్నారు. వరుసగా తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ శ్రీయా రెడ్డి కెరీర్‌లో దూసుకుపోతున్నారు.
