Sabari: ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ చేతుల మీదుగా ‘శబరి’ పాట విడుదల 

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 06:22 PM IST

Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. మహర్షి కూండ్ల చిత్ర సమర్పకులు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ విడుదల చేసిన ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు ‘అనగనగా ఒక కథలా…’ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు. ‘అనగనగా ఒక కథలా…’ పాటకు సుచిత్రా చంద్రబోస్ నృత్య రీతులు సమకూర్చారు.

తన సతీమణి కొరియోగ్రఫీ చేసిన పాటను చంద్రబోస్ తన చేతుల మీదుగా విడుదల చేయడం ఇదే తొలిసారి. పాటను విడుదల చేసిన తర్వాత చంద్రబోస్ మాట్లాడుతూ… ”ఇప్పుడే నేను ‘శబరి’ సినిమాలోని ‘అనగనగా ఒక కథలా…’ పాటను విడుదల చేశా. గోపీసుందర్ గారి సంగీతంలో రెహమాన్ గారు రాశారు. ఈ పాట చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఈ సాంగ్ విడుదల కంటే ముందు నేను విన్నాను. నా భార్య సుచిత్ర కొరియోగ్రఫీ చేయడం కోసం ఇంటికి సాంగ్ తీసుకు వచ్చింది. సాంగ్ విని సాహిత్యం చదువుతానని తీసుకున్నా. చదువుతుంటే నాకు చాలా చాలా సంతోషం కలిగింది. ఈ పాట ఎవరు రాశారు? కథ ఏమిటి? అని ఫోన్ చేసి మాట్లాడాను. చాలా మంచి బాణీకి అంతే అందమైన భావాలతో కూడిన సాహిత్యం రాశారు.

నా చేతుల మీదుగా విడుదల చేయించారని మంచిగా చెప్పడం కాదు… పాట విడుదలకు ముందే విని ఎంతో నచ్చే నిర్మాతను, గేయ రచయితను అభినందించా. ఈ పాట తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది. చిత్ర గారు ఈ పాటకు తన గాత్రంతో జీవం పోశారు. తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని ప్రతి పదంలో చూపించారు. తల్లి కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలి. నిర్మాత మహేంద్రనాథ్ గారితో పాటు చిత్ర బృందం అందరికీ పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా” అని చెప్పారు.
సుచిత్రా చంద్రబోస్ మాట్లాడుతూ… ”నేను కొరియోగ్రఫీ అందించిన పాటను మా ఆయన ఇదే తొలిసారి. చాలా సంతోషంగా ఉంది. ‘శబరి’ సినిమాలో చక్కటి సందర్భంలో వచ్చే గీతమిది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్రనాథ్ గారికి థాంక్స్” అని‌ చెప్పారు.
‘అనగనగా ఒక కథలా…’ పాట విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ ”తల్లి ప్రేమ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో మా ‘శబరి’ ప్రత్యేకంగా నిలుస్తుంది.

‘శబరి’ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి ‘అనగనగా ఒక కథలా…’ అంటూ రెహమాన్ సాహిత్యం అందించగా… లెజెండరీ సింగర్ కెఎస్ చిత్ర ఆలపించారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాటను విడుదల చేశారు. బిడ్డ మీద తల్లి ప్రేమ ఎప్పటికీ కరగదని చెప్పే గీతం ‘అనగనగా ఒక కథలా’. తల్లికి బిడ్డే ప్రపంచం అని చెప్పే గీతమిది. చిన్నారి పిలుపునకు బదులు తల్లి, చిన్నారి అడుగులకు గొడుగు తల్లి, చిన్నారి కలలకు రంగులు తల్లి అంటూ కన్నపేగుతో అమ్మకు ఉండే బంధాన్ని రెహమాన్ అద్భుతంగా రాయగా… చిత్ర గాత్రం ఆ పాటలో భావం ప్రేక్షకులకు చేరువ అయ్యేలా అంతే గొప్పగా పాడారు.