సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఉన్నంత మాత్రాన సరిపోదు.. బాక్సాఫీస్ వద్ద విజయం కూడా వరిస్తేనే ఇక్కడ క్రేజ్ నిలబడుతుంది. బాలీవుడ్ నుంచి వచ్చిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే సైతం తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే సత్యాన్ని ఎదుర్కొంది. రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ లాంటి భారీ పరాజయంతో కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో ఆమెపై ఇండస్ట్రీలో ‘ఐరన్ లెగ్’ అనే ముద్ర వేసే ప్రయత్నాలు జరిగాయి. వరుస ఫ్లాపులు వస్తున్నా ఆమెకు అవకాశాలు తగ్గకపోయినప్పటికీ, మనసులో మాత్రం ఒక సాలిడ్ హిట్ కోసం ఆమె ఎంతో ఆరాటపడింది. ఎట్టకేలకు అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ఈ భామ కళ్లల్లో ఆనంద బాష్పాలు కురిశాయి.
‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలవడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకలో మైక్ పట్టుకుని మాట్లాడేందుకు ముందుకు వచ్చిన భాగ్యశ్రీ బోర్సే, ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఎదుర్కొన్న విమర్శలు, ‘లెనిన్’ సినిమా కోసం పడిన కష్టం, ముఖ్యంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున తన నటనపై కురిపించిన ప్రశంసలను గుర్తుచేసుకుంటూ ఆమె స్టేజీపైనే ఏడ్చేశారు. ఆమె కళ్లల్లో నీళ్లు రావడం చూసి అక్కడున్న వారు కూడా భావోద్వేగానికి గురయ్యారు.
కొద్దికొద్దిగా తెలుగులో మాట్లాడుతూ తన క్యూట్ స్పీచ్‌తో అభిమానులను కట్టిపడేసిన భాగ్యశ్రీ… ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. “నా అభిమానులు నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వారు చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న రీల్స్, ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. ఈ చిత్ర బృందం నాకు ఒక కుటుంబంలా సపోర్ట్ చేసింది” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, “హైదరాబాద్ నా కర్మభూమి. ఇక్కడి ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ఆదరణ మరువలేనిది. నా సినీ ప్రయాణంలో ఆఖరి సినిమా కూడా ఈ టాలీవుడ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ సినీ ఇండస్ట్రీపై తనకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు.
భాగ్యశ్రీకి ‘లెనిన్’ చిత్రం తెలుగులో ఒక లక్కీ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి ‘భారతి’గా ఆమె చేసిన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా అఖిల్‌తో ఆమె పండించిన లవ్ ట్రాక్, ఎమోషనల్ సన్నివేశాలు, స్క్రీన్ కెమిస్ట్రీ థియేటర్లలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఒకవైపు అఖిల్ అక్కినేని తన కెరీర్‌లో తొలి భారీ విజయం దక్కడంతో నాగార్జున కాళ్లపై పడి ఎమోషనల్ అవ్వగా, మరోవైపు హీరోయిన్ భాగ్యశ్రీ కూడా తనపై ఉన్న ఫ్లాప్ ముద్ర తొలిగిపోవడంతో కన్నీటి పర్యంతమవడం ఈ సక్సెస్ మీట్‌లో హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి ‘లెనిన్’ సక్సెస్ భాగ్యశ్రీ బోర్సే కెరీర్ గ్రాఫ్‌ను టాలీవుడ్‌లో సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Actress #BhagyashriBorse Than Emotional In The #Lenin Success Meet 🥺❤️#AkhilAkkineni pic.twitter.com/iGw9ASVefr
— FilmUpdates36 (@Jaswanth_35679) July 11, 2026
