Niharika Konidela రుచికరమైన వంటకు సార్థకత చేకూరేది పద్ధతిగల వడ్డింపుతోనే. ఓ మోస్తరుగా వంట ఉన్నా కూడా వడ్డించే విధానం కుదిరితే నోటికి రుచిగా, కన్నులకు ఇంపుగా ఉంటుంది. కాబట్టి మంచిగా వండటమే కాదు.. రుచిగా వడ్డించడం కూడా కీలకమే. ఇదే సూత్రం సినిమాకి కూడా వర్తిస్తుంది. సినిమా బాగా తీయడంతో పాటు.. ఎంత బాగా ప్రమోట్ చేశాం అన్నది కూడా కీలకం. కంటెంట్ బాగున్న సినిమాకి సరైన ప్రమోషన్స్ లేక చతికిలబడ్డ సినిమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ప్రమోషన్స్ విషయంలో మెగా డాటర్ నిహారిక పక్కా ప్రణాళికతో వెళ్తోంది. మెగా ప్రమోషన్స్‌తో మెగా పవర్ స్టార్‌నే అబ్బురపరిచేట్టు చేసింది. సినిమా 55 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తే.. 60 రోజులు ప్రమోషన్స్‌కి కేటాయించి తన కొత్త సినిమా ‘రాకాస’కి ప్రీ రిలీజ్ బిజినెస్‌తో పాజిటివ్ వైబ్స్ తీసుకుని వచ్చింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ ఏ ఒక్క ప్రాంతాన్ని వదిలిపెట్టలేదు. కష్టే ఫలి అంటారు కదా.. మరి నిహారిక పడిన కష్టానికి ఫలితం ఎంత వరకూ వచ్చిందో ‘రాకాస’ రివ్యూలో చూద్దాం.
ఊరిలో పెద్ద కోట.. ఆ కోటలో ‘రాకాస’ దెయ్యం.. ఆ దెయ్యం వెనుక జనాల్ని వేటాడి వెంటాడే కథ. అసలు ఆ కోటలో ఏముంది? కోటలోకి వెళ్లిన వీరుడు వీరబాబు (పిరికోడు) ఏమయ్యాడు? అన్నదే ‘రాకాస’ కథా నేపథ్యం. ఇక మూల కథలోకి వెళితే.. ఇది వెయ్యేళ్ల క్రితం మొదలైన సోషియో ఫాంటసీ కథ. రాజుల కాలం నుంచి ఆ ఊరి చివర కోటలో ఉన్న భీకర బ్రహ్మరాక్షసుడు (రాకాస)కి నరబలి అర్పిస్తుండటం అనేది ఆ ఊరి ఆచారం. అలా కోటలోకి వెళ్లిన ఏ ఒక్కరూ తిరిగి బయటకు రారు. వెయ్యేళ్లుగా ఆ ఆచారం కొనసాగుతూనే ఉంటుంది. కోటలో ఉన్న రాక్షసుడు (రాకాస) నుంచి హెచ్చరికలు వచ్చిన ప్రతిసారీ ఓ నిండు ప్రాణాన్ని బలిగా పంపిస్తుంటారు. అలా ఓ పసిబిడ్డని కూడా బలికి పంపిస్తారు. ఒకవేళ బలి ఇవ్వకపోతే.. ఆ ఊరంతా మాయా వలయంలో ఉంటుంది. ఎవరూ ఊరు విడిచి బయటకు వెళ్లలేరు. బలి ఇవ్వకపోతే ఊరు మొత్తం నాశనం అయిపోతుందనే మూఢనమ్మకంతో హెచ్చరికలు వచ్చిన ప్రతిసారి బలి అర్పిస్తుంటారు. ఆ రాకాసని అంతం చేయడానికి వెళ్లిన ఓ రాజు.. రాకాస చేతిలో చనిపోతాడు. అప్పటి నుంచి ఆ రాకాసకి ఎవరూ ఎదురుతిరగరు. ఆ కోటలో నిజంగానే రాక్షకుడు ఉన్నాడనే భయంతో ఎవరూ ఆ కోట వైపు వెళ్లరు.
అయితే వెయ్యేళ్ల తరువాత 2026లో ఆ ఊరివాడైన వీరబాబు (సంగీత్ శోభన్) తన ప్రేయసి సుకన్యని వెతుక్కుంటూ వస్తాడు. తీరా అతను వచ్చేసరికి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని వీరబాబుని మోసం చేస్తుంది. ఆ బాధలో పూటుగా తాగి.. ఆ ఊరి వాడైన సోము (వెన్నెల కిషోర్) హత్యకేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి బయటపడే ప్రాసెస్‌లో ఉండగా.. కోటలో ఉన్న ‘రాకాస’ నుంచి మూడు హెచ్చరికలు వస్తాయి. ఊరి పెద్దలంతా కోటలోకి నరబలి పంపడానికి సిద్ధపడతారు. వీరబాబు మిత్రుడైన బాలరాజు (గెటప్ శీను)ని కోటలోకి బలిగా పంపాలని తీర్మానం చేస్తారు. అయితే మిత్రుడ్ని కాపాడుకునే ప్రయత్నంలో అదంతా మూఢనమ్మకం అని బాలరాజు ఆర్పాల్సిన దీపాన్ని వీరబాబు ఆర్పేస్తాడు. దీపం ఎవరు ఆర్పితే వాళ్లే కోటలోకి వెళ్లాలనే నిబంధన ఉండటంతో.. వీరబాబుని బలిగా ఆ కోటలోకి పంపిస్తారు. అసలు ఆ కోటలోకి వెళ్లిన తరువాత మన పిరికివాడైన వీరుడు వీరబాబు ఏం చేశాడు? అసలు ఆ రాకాస ఎవరు? సోము ఏమయ్యాడు? వీరబాబుపై మనసు పడ్డ సుబ్బలక్ష్మి (నయన్ సారిక) ఏం చేసింది? అసలు ఆ కోటలో రాక్షసుడు ఉన్నాడా? లేడా..? అన్నదే మిగిలిన కథ.
రాజ్యం.. రాజ్యాలు.. కోట.. ఆ కోటలో రాక్షసుడు.. వెయ్యేళ్ల కాలం నాటి సెటప్. ‘రాకాస’ సినిమా ఆరంభంలో ఈ భారీ సెటప్ అంతా చూస్తే దర్శకురాలు మానస శర్మ.. గట్టిగానే ప్లాన్ చేసిందే అనే భావన కలుగుతుంది. కానీ ఎప్పుడైతే మన వీరుడు వీరబాబు (సంగీత్ శోభన్) ఎంటర్ అయ్యాడో కథ స్వరూపం మారిపోతుంది. అప్పటివరకూ సోషియో ఫాంటసీగా కనిపించిన కథ.. కామెడీ ట్రాక్‌లోకి వెళ్తుంది. ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన వీరబాబుని తీసుకెళ్లి కోటలో పడేయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఏదో చందమామ కథని చూస్తున్న భావన కలిగించి.. వీరబాబులోని ఫన్ ఎలిమెంట్స్‌ని పూర్తిగా వాడుకుంటూ.. కథని నడిపిన విధానం బావుంది. ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జోనర్‌లను సమాంతరంగా జోడిస్తూ.. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చూశాం అనే భావన కలుగుతుంది.
అయితే ఇలాంటి హారర్, సోషియో ఫాంటసీ కథలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. చూసినంతవరకూ ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటాయి. కానీ లాజిక్‌లు లాగితే మాత్రం అది నిజమే కదా అనిపిస్తుంది. ‘రాకాస’ కథ వెయ్యేళ్ల క్రితం నుంచి 2026కి ట్రావెల్ అవుతుంది. ఈ రోజుల్లో కూడా ఈ రాక్షసుడు ఏంటి? కోట ఏంటి? బలి ఏంటి? మరి పోలీసులు, కేసులు, కోర్టులు ఏమీ లేవా? అని ఆలోచిస్తే మాత్రం ‘రాకాస’ని ఎంజాయ్ చేయలేరు. క్లైమాక్స్‌లో రాకాస గురించి ఏదో అద్భుతాన్ని ఊహించుకుంటే నిరాశ తప్పదు. ‘రాకాస’లో వచ్చిన రియలైజేషన్ కూడా అతికించినట్టే ఉంటుంది. బట్ చివర్లో దెయ్యం లేదు గియ్యం లేదు అంటే అది రొటీన్ సినిమా అయిపోయేదే. కానీ ‘రాకాస’ అలాంటి రొటీన్ కాన్సెప్ట్‌లకు భిన్నంగానే అనిపిస్తుంది.
ఫస్టాఫ్‌లో రాకాస నేపథ్యం ఒక ప్రత్యేక అనుభూతి కాగా.. ఆ తరువాత నుంచి సంగీత్ శోభన్ అల్లరి మామూలుగా ఉండదు. వెన్నెల కిషోర్, గెటప్ శీనులతో కలిసి ఫన్ రైడ్ అందించారు. ముఖ్యంగా సంగీత్ శోభన్ సింగిల్ లైన్ పంచ్‌లు థియేటర్స్‌లో గలగల నవ్వేట్టు చేశాయి. వచ్చాడంటే పంచ్ వేసేస్తాడు అని మొహాలపై నవ్వుల్ని రెడీ చేసిపెట్టేట్టు చేశాడు. ఏదో నటిస్తున్నట్టుగా కాకుండా.. వీడు ఇలాగే ఉంటాడా అనేట్టుగా వీరబాబు పాత్రలో ఒదిగిపోయాడు. కోటలోకి వెళ్లడం.. దెయ్యాన్ని చూడడం.. ఆ దెయ్యాన్ని చూసి హీరో భయపడటం ఇదంతా చాలా రొటీన్ సెటప్. కానీ ఆ రొటీన్‌కి ఫన్ జోడించి.. వినోదపు విందు అందించాడు సంగీత్ శోభన్.
దర్శకురాలు మానస శర్మ.. కథ రాసిన తరువాత సంగీత్ శోభన్‌ని సెలెక్ట్ చేసుకుందో.. లేక సంగీత్ శోభన్‌ని చూసి ఈ కథ రాసుకుందో ఏమో కానీ.. ఈ కథకి అతనే పర్ఫెక్ట్ అనేట్టుగా చేశాడు. విఠలాచార్య తరహా సోషియో ఫాంటసీ కథకి సంగీత్ శోభన్ హీరో అంటే.. సెట్ అవుతాడా అనే సందేహాలు వస్తుంటాయి.. కానీ మానస శర్మ నమ్మకాన్ని వందరెట్లు ఎక్కువ నిలబెట్టాడు సంగీత్ శోభన్. ఎందుకంటే కథ మొత్తం వీరబాబు పాత్రపైనే ల్యాండ్ అయ్యి ఉంటుంది. అతని పెర్ఫామెన్స్ కీలకం.. ఏమాత్రం అటు ఇటూ చేసినా కూడా బోర్ కొట్టేసేది. కానీ తన కామెడీ టైమింగ్‌తో బోరింగ్ కలిగిన ప్రతిసారి నవ్వులు పూసేట్టు చేశాడు సంగీత్ శోభన్. నాన్ స్టాప్ కామెడీతో పరుగులు పెట్టించాడు.
హీరోయిన్ నయన్ సారిక భలే క్యూట్‌గా ఉంది. కథ అన్న తరువాత కథానాయిక ఉండాలి అన్నట్టుగా కాకుండా.. ఆమె కూడా కోటలోకి అడుగుపెట్టడానికి కథలో కథానాయికకి స్కోప్ ఇచ్చారు. శోభన్, సారికల జంట డీసెంట్‌గా బావుంది. రాకాస సినిమా ప్రమోషన్స్‌లో గెటప్ శీను ఎక్కువగా కనిపించేసరికి.. కథలో మెయిన్ లీడ్ అనుకున్నాం కానీ.. వెన్నెల కిషోర్ రోల్ సర్ ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. గెటప్ శ్రీను కంటే కూడా వెన్నెల కిషోర్ ఎపిసోడ్ హైలైట్ అయ్యింది. వెన్నెల కిషోర్ పక్కన.. జబర్దస్త్ రోహిణి కామెడీ పండించింది. బ్రహ్మాజీ సింగిల్ లైన్ పంచ్‌లు పేలాయి. తనికెళ్ల భరణికి బ్రాహ్మణుడిగా అలవాటైన పాత్రే కానీ.. ఆ పాత్రకి సరైన ప్రాధాన్యత కల్పించారు.
హారర్, సోషియో ఫాంటసీ బ్యాగ్రాప్ చిత్రాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కీలకం. చిన్న చిన్న సన్నివేశాలను కూడా తమ ఆర్ఆర్‌తో భయపెట్టగలిగి థ్రిల్ చేసే విధంగా ఉండాలి. ఈ విషయం అనుదీప్‌కి ఫుల్ మార్క్స్ పడతాయి. ఓ పక్క కామెడీ ట్రాక్.. అటు హారర్, సోషియో ఫాంటసీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. థ్రిల్ అయ్యేట్టు చేశారు. ముఖ్యంగా కోటలోకి వెళ్లిన తరువాత తన వాయిద్యాలకు గట్టిగానే పనిచెప్పాడు అనుదీప్. సినిమాకి ఎక్కువ ఖర్చు పెడితే.. గ్రాండ్‌గా తక్కువ ఖర్చు పెడితే నాసిరకంగా చూపిస్తుంటుంది కెమెరా వర్క్. కానీ బడ్జెట్ తక్కువైనా కూడా ఆ లోపం విజువల్‌లో కనిపించకుండా చేయడం అనేది కొందరికే సాధ్యం అవుతుంది. కెమెరామెన్ రాజు ఎదురోలు ఈ విషయంలో తన పనితనం చూపించారు.
వీఎఫ్ఎక్స్ విజువల్స్ అద్భుతంగా అనిపించకపోయినా కూడా నాసిరకం అనే భావన కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సోషియో ఫాంటసీ కథకి వందల కోట్లు బడ్జెట్ పెట్టి విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే అవకాశం ఉన్నా నేలవిడిచి సాము చేయకుండా పరిమిత బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్ ఇచ్చారు. విఎఫ్ఎక్స్ వర్క్ వండర్స్ క్రియేట్ చేయలేదు కానీ నాసిరకంగా అయితే అనిపించవు. నిర్మాణ విలువలతో మరోసారి ఆకట్టుకుంది మెగా ప్రొడ్యూసర్ నిహారిక. ప్రేక్షకులు పెట్టే ప్రతి పైసాకు న్యాయం చేస్తుంది రాకాస అని ముందే చెప్పారు నిహారిక. ఆ మాట నిలబెట్టుకున్నారు. సమ్మర్ సీజన్ కావడంతో పిల్లలు ‘రాకాస’ని బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మరి పెద్దలు కూడా థియేటర్స్‌కి రావాల్సిందే కాబట్టి ‘రాకాస’కి కాసులు లోటు ఉండదు.
