The Odyssey : హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ విజువల్ వండర్‌గా తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ది ఒడిస్సీ’ (The Odyssey) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. భారతదేశంలో ఐమాక్స్ (IMAX), త్రీడీ ఫార్మాట్లలో అత్యధిక థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.17.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ అనలిటిక్స్ సంస్థ ‘శాక్‌నిల్క్’ (Sacnilk) నివేదికల ప్రకారం.. రెండో రోజైన శనివారం ఈ చిత్రం మరింత పుంజుకుని ఏకంగా రూ.22 కోట్లు కొల్లగొట్టింది. దీంతో కేవలం రెండు రోజుల్లోనే భారత బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.39.40 కోట్ల భారీ నెట్ వసూళ్లను సాధించి నోలన్ మ్యాజిక్‌ను మరోసారి నిరూపించింది.
థియేటర్లలో 54% ఆక్యుపెన్సీ.. గ్లోబల్ మార్కెట్‌లో $250 మిలియన్ల మార్క్ దాటిన వసూళ్లు!
ఈ సినిమాకు అందుతున్న అద్భుతమైన టాక్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లోని థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా శనివారం రోజున దేశవ్యాప్తంగా థియేటర్లలో ఏకంగా 54.4 శాతం ఆక్యుపెన్సీ నమోదు కావడం ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే అంతర్జాతీయంగా 257.8 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,150 కోట్లు) కలెక్షన్లను రాబట్టినట్లు హాలీవుడ్ ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి. క్రిస్టోఫర్ నోలన్ మార్క్ స్క్రీన్ ప్లే, అద్భుతమైన విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లకు కట్టిపడేస్తుండటంతో, వీకెండ్ ముగిసే సమయానికి ఈ కలెక్షన్ల గ్రాఫ్ మరింత భారీగా పెరగడం ఖాయమని సినిమా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
