Site icon HashtagU Telugu

Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ స‌మంత‌కే ఎందుకిలా?

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) తండ్రి జోసెఫ్ ప్రభు గుండెపోటుతో మృతి చెందిన విష‌యం మ‌న‌కు తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టా ద్వారా వెల్లడించారు. ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేశారు. దీంతో సమంతకు సానుభూతి తెలియజేస్తూ ఆమె అభిమానులు నెట్టింట పోస్టులు పెట్టారు. అయితే స‌మంత‌ను గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వ్య‌క్తిగ‌తంగా కఠిన స‌వాళ్ల‌ను ఎదుర్కొంటున్నారు. ప్రేమించి పెళ్లాడిన నాగ‌చైత‌న్య‌తో విడాకులు, ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ అనే వ్యాధి ఆమెను మాన‌సికంగా కుంగ‌దీశాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకుంటున్న స‌మంత‌కు తండ్రి మృతి మ‌రో పెద్ద దెబ్బగా మారింది. క‌ష్ట స‌మయంలో త‌న‌కు అండ‌గా నిలిచిన తండ్రిని కోల్పోవ‌డాన్ని సమంత జీర్ణించుకోలేక‌పోతుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి,

స‌మంత ప్ర‌స్తుతం సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే వ‌రుణ్ ధావ‌న్‌- స‌మంత క‌లిసి న‌టించిన సిటాడెల్ హనీ బ‌న్నీ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌పోతే స‌మంత వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల‌న గ‌త కొన్నేళ్లుగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఏం మాయా చేశావే మూవీతో తెలుగులో సాలిడ్‌ ఎంట్రీ ఇచ్చిన స‌మంత టాలీవుడ్‌లో టాప్ హీరోలంద‌రితో క‌లిసి ప‌నిచేసింది. జూ.ఎన్టీఆర్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేశ్ బాబు, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలంద‌రితో క‌లిసి చిందులు వేసింది. అయితే సినిమాల ప‌రంగా జోరు మీదున్న స‌మ‌యంలో స‌మంత నాగ‌చైత‌న్య‌ను ల‌వ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చింది.

Also Read: Seasonal Diseases: సీజనల్ వ్యాధుల నిర్మూలనపై మంత్రి కీల‌క స‌మావేశం

అంతేకాకుండా వీరిద్దరి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. అంతా స‌వ్యంగా సాగుతున్న స‌మ‌యంలో నాగ చైత‌న్య‌, స‌మంత మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి డివోర్స్ అప్లై చేశార‌నే వార్త‌లు సినీ పెద్ద‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేశాయి. నాలుగేళ్ల వివాహ బంధం త‌ర్వాత నాగ చైత‌న్య‌, స‌మంత విడిపోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌నే ఇద్ద‌రం విడిపోతున్నట్లు ఇరువురు ప్ర‌క‌టించారు. అయితే వీరిద్ద‌రూ విడిపోవ‌టానికి గ‌ల కార‌ణాల‌ను ఇంత‌వ‌ర‌కు చెప్ప‌లేదు కూడా.

ఆ త‌ర్వాత మ‌యోసైటిస్ అనే వ్యాధితో స‌మంత చాలా స్ట్ర‌గుల్ ఫేస్ చేశారు. వైద్య చికిత్స తీసుకుంటూనే ఆమె సినిమాల్లో యాక్ట్ చేశారు. ఎన్నో సార్లు ఆమె ఈ వ్యాధి ప‌ట్ల భావోద్వేగానికి గుర‌య్యారు. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స‌మంత‌కు త‌న తండ్రి మ‌ర‌ణం మ‌రో పెద్ద దెబ్బ‌గా మారింది. అభిమానులు సైతం స‌మంత ధృడంగా ఉండాల‌ని కామెంట్లు పెడుతున్నారు.