Salman Khan : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మూడు రోజుల క్రితం హత్య బెదిరింపు సందేశాలు పంపిన వ్యక్తి దొరికాడు. సదరు నిందితుడి పేరు మయాంక్ పాండ్యా. వయసు 26 ఏళ్లు. గుజరాత్‌లోని వడోదర వాస్తవ్యుడు. ముంబైలోని వర్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మయాంక్ ఏప్రిల్ 13న ఉదయం 6:30 గంటలకు ముంబైలోని వర్లీ ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబరుకు బెదిరింపు సందేశాన్ని పంపాడు. ఆ నంబరును ట్రాక్ చేయగా.. అది గుజరాత్‌లోని వడోదరలో ఉన్నట్లు వెల్లడైంది. ‘‘సల్మాన్‌ను ఇంట్లోకి వెళ్లి చంపుతాం. అవసరమైతే సల్మాన్ ఖాన్(Salman Khan) కారులో బాంబు పెట్టి పేలుస్తాం’’ అని బెదిరింపు మెసేజ్‌లో మయాంక్ హెచ్చరించాడు. ఈ సందేశంలో అతడు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కూడా ప్రస్తావించాడని తెలుస్తోంది. దీనిపై వర్లీ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 351(2), 351(3) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read :Robert Vadra : ఈడీ ఎదుటకు రాబర్ట్ వాద్రా.. ఆయనపై అభియోగం ఏమిటి ?
రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ..
ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 3), దత్తాత్రే కాంబాలే వెంటనే ఒక పోలీసు బృందాన్ని వడోదరకు పంపారు. అక్కడ వారు అనుమానితుడు మయాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మయాంక్‌ను తీవ్రంగా ప్రశ్నించిన అనంతరం పోలీసులు వదిలేశారు. మయాంక్ మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు, మూడు రోజుల తర్వాత మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని మయాంక్‌కు ముంబై పోలీసులు సూచించారట.
Also Read :Split In NDA : ఎన్‌డీఏకు కటీఫ్.. ‘ఇండియా’లోకి ఆ పార్టీ ?
మయాంక్‌కు పిచ్చి నిజమేనా ?
మానసిక సమస్యలు కలిగిన వారు తమ గురించి తామే సరిగ్గా ఆలోచించుకోలేరు. సల్మాన్ ఖాన్ గురించి ఎలా ఆలోచిస్తారు ? ఒకవేళ సల్లూ భాయ్ గురించి ఆలోచించినా.. చంపాలని ఎందుకు అనుకుంటారు ? ఇతరులను చంపాలని నిర్ణయించుకునే పిచ్చి వ్యక్తి.. అంత పర్ఫెక్టుగా వార్నింగ్ మెసేజ్‌ను రాయగలడా ? ఈ ప్రశ్నలన్నింటికీ ముంబై పోలీసు వర్గాలు సమాధానాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలాసార్లు సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు పంపిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులోనే ఉన్నాడు. ఈసారి సల్మాన్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చింది కూడా గుజరాత్ నుంచే. ఇటీవలే బెదిరింపు మెసేజ్ పంపిన మయాంక్ పాండ్యాకు పిచ్చి ఉండి ఉంటే.. అతడి ఫోన్ ద్వారా చక్కగా వార్నింగ్ మెసేజ్‌ను రాసి పంపింది ఎవరు ? అనే విషయాన్ని పోలీసులు తేల్చాల్సి ఉంది.
కండలు చూపిస్తూ సల్లూభాయ్ ఫొటోలు
ఓ వైపు హత్య బెదిరింపులు వస్తున్నా.. సల్మాన్ ఖాన్ కూల్‌గా తన పని తాను కానిస్తున్నారు. రోజూ ఆయన జిమ్ వర్కౌట్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. తాజాగా జిమ్ వర్కౌట్ వేళ తన కండలను చూపిస్తూ దిగిన పలు ఫొటోలను ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తద్వారా బెదిరింపులకు భయపడేది లేదనే సందేశాన్ని ఇచ్చారు.