పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ (Pawan Kalyan – Renu Desai) కుమారుడు అకీరా నందన్ (Akira Nandan) సినీ రంగ ప్రవేశంపై అభిమానుల్లో ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. తాజాగా రాజమండ్రి వచ్చిన రేణూ దేశాయ్ తన కుమారుడి సినీ ఎంట్రీపై స్పందించారు. అకీరా ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడని తరచూ ప్రశ్నలు ఎదుర్కొంటున్నానని, ఈ విషయంలో తాను కూడా ఆసక్తిగా ఉన్నానని ఆమె తెలిపారు. అకీరా సినీ రంగ ప్రవేశం పట్ల తాను ఒత్తిడి చేయలేనని రేణూ స్పష్టంచేశారు. ఇది పూర్తిగా అకీరా నిర్ణయం అని, ఎప్పుడు రావాలనుకుంటాడో అతడే నిర్ణయించుకుంటాడని అన్నారు. తల్లిగా తనకు కూడా ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ, అకీరా స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరం ఉందని రేణూ వ్యాఖ్యానించారు.
అకీరా నందన్ పుణేలో తన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత, ప్రస్తుతం అమెరికాలో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నాడు. సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికే శిక్షణ తీసుకుంటున్నాడని అభిమానులు భావిస్తున్నారు. అయితే అకీరాకు నటనతో పాటు సంగీతం పట్ల కూడా ఆసక్తి ఉంది. పియానో వాయించడంలో అతడు మంచి నైపుణ్యం సాధించాడని సమాచారం. తండ్రి పవన్ కల్యాణ్, తల్లి రేణూ దేశాయ్ ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారు కావడంతో అకీరా వెండితెరపై అడుగు పెట్టడం సహజంగానే అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. అయితే, అకీరా తల్లిదండ్రుల మార్గాన నడుస్తాడా? లేదా సంగీతాన్నే కెరీర్‌గా ఎంచుకుంటాడా? అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.
Read Also : Nalgonda: నల్గొండ మాతా శిశు సంరక్షణ కేంద్రానికి మహర్దశ