Upasana : అయ్యప్ప స్వామి మాలలో ఉన్న హీరో రామ్‌చరణ్ ఇటీవలే కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ నిర్వహించిన నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయ్యప్ప మాల ధారణలో ఉండగా దర్గాను రామ్‌చరణ్ సందర్శించడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఆ విమర్శలపై రామ్‌చరణ్ సతీమణి ఉపాసన అసహనం వ్యక్తంచేశారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె స్పష్టం చేశారు. దేవుడిపై ఉండే విశ్వాసం అనేది అందరినీ ఏకం చేస్తుందని ఉపాసన తెలిపారు. అది ఎన్నడూ మనుషులను చిన్నాభిన్నం చేయదని స్పష్టం చేశారు. భారతీయులుగా తాము అన్ని మత విశ్వాసాలను గౌరవిస్తామని ఆమె తేల్చి చెప్పారు. ఐక్యతలోనే తమ బలం ఉందన్నారు. రామ్‌చరణ్(Upasana) తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలనూ ఎప్పుడూ గౌరవిస్తారని ఉపాసన వెల్లడించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకు.. ‘వన్ నేషన్.. వన్ స్పిరిట్’ అని ఆమె హ్యాష్‌ట్యాగ్‌లను జతపరిచారు.
Also Read :Gold Price : ‘కస్టమ్స్’ తగ్గాయి.. అందుకే బంగారం ధరకు రెక్కలు!
కడప దర్గా విజిట్‌కు గల కారణాన్ని ఇటీవలే రాంచరణ్ స్వయంగా వెల్లడించారు. మగధీర సినిమా రిలీజ్‌కు ఒకరోజు ముందు కూడా తాను ఈ దర్గాకు వచ్చానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ దర్గా విజిట్ తర్వాత మగధీర్ సక్సెస్ అయి.. తనకు స్టార్‌డమ్ వచ్చిందని రాంచరణ్ చెప్పుకొచ్చారు. తాను ఎప్పటికీ కడప పెద్ద దర్గాకు రుణపడి ఉంటానన్నారు. కడప దర్గాలో జరిగే ముషాయిరా గజల్ ఈవెంట్‌కు వెళ్తానని ఏఆర్ రెహమాన్‌కు తాను మాటిచ్చినట్లు రాంచరణ్ తెలిపారు. అందుకే అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ దర్గాను సందర్శించుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. జనవరి 10న రాంచరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానుంది. శంకర్ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. ఇందులో రాంచరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. ఈ మూవీలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. త్వరలో బుచ్చిబాబుతో మరో మూవీని రాంచరణ్ తీయబోతున్నారు. ఈనేపథ్యంలోనే కడప దర్గాలో నిర్వహించిన ముషాయిరా గజల్ ఈవెంట్‌కు బుచ్చిబాబుతో కలిసి రాంచరణ్ వెళ్లారు.