Rajasaab : సినీ అభిమానులను ఉత్కంఠకు గురి చేసిన ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘రాజాసాబ్’ టీజర్ లీక్ ఘటనపై నిర్మాతలు పోలీసులను ఆశ్రయించారు. సినిమా యూనిట్‌లో సభ్యుడైన డబ్బింగ్ ఇంఛార్జ్ వసంత్‌కుమార్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. ఇందులో ఈనెల జూన్ 16న అధికారికంగా విడుదలైన టీజర్ మూడు రోజుల ముందే అంటే జూన్ 13 నుంచే సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. టీజర్‌ను చట్టవ్యతిరేకంగా లీక్ చేయడం వల్ల చిత్రబృందానికి ఆర్థికంగా, సాంకేతికంగా నష్టం వాటిల్లిందని వసంత్‌కుమార్ తెలిపారు.
ఈ విషయంలో బాధ్యత వహించాల్సిన వారెవరో గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిత్రబృందం పూర్తి స్థాయిలో టీజర్ విడుదలకు ప్రణాళిక సిద్ధం చేసిందని, అటువంటి సమయంలో టీజర్ ముందుగా లీక్ కావడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ‘రాజాసాబ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ మాస్ లుక్, టీజర్ విజువల్స్ సోషల్ మీడియాలో హీట్ క్రియేట్ చేస్తుండగా, లీక్ కారణంగా టీజర్ అనధికారికంగా వైరల్ కావడం చిత్ర యూనిట్‌ను కాస్త కలవరపరిచింది. ఈ అంశంపై విచారణ ప్రారంభించిన బంజారాహిల్స్ పోలీసులు, టెక్నికల్ ఆధారాల ద్వారా లీక్ చేసిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.