Golden Globes 2025 : ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమా విడుదల అయినప్పటి నుంచి మనదేశంలో డైరెక్టర్ పాయల్ కపాడియా పేరు మార్మోగుతోంది. 2024 మేలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీకి గ్రాండ్ ప్రిక్స్ అవార్డు వచ్చింది. పాయల్ కపాడియా డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ ప్రఖ్యాత బాఫ్టా పురస్కారాలకు సైతం నామినేట్ అయింది. అయితే తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రేసులో మాత్రం ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’ సినిమాకు, పాయల్ కపాడియా చుక్కెదురైంది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలోని బెస్ట్ మోషన్ పిక్చర్ విభాగంలో ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’కు(Golden Globes 2025) భంగపాటు ఎదురైంది. ఈ అవార్డును ఫ్రాన్స్ మూవీ ‘ఎమీలియా పెరెజ్’ కైవసం చేసుకుంది. ఇక ‘బెస్ట్ డైరెక్షన్’ కేటగిరీలో పాయల్ కపాడియా వెనుకంజలో ఉండిపోయారు. ‘ది బ్రూటలిస్ట్’ సినిమా డైరెక్టరు బ్రాడీ కార్బెట్‌కు ‘బెస్ట్ డైరెక్షన్’ అవార్డు దక్కింది.
Also Read :PK Arrest : నిరాహార దీక్ష చేస్తున్న పీకే అరెస్ట్.. కోర్టుకు వెళ్తానన్న ప్రశాంత్ కిశోర్
- బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో పాయల్ కపాడియాతో పాటు పోటీపడిన వారిలో జాక్వెస్ ఆడియార్డ్ (ఎమీలియా పెరెజ్), సీన్ బేకర్ (అనోరా), ఎడ్వర్డ్ బెర్జర్ (కాంక్లేవ్), కోరాలీ ఫార్గీట్ (ది సబ్ స్టాన్స్) ఉన్నారు.
- బెస్ట్ నాన్ ఇంగ్లిష్ ఫిల్మ్ కేటగిరీలో పోటీపడిన సినిమాల్లో.. ‘ది గర్ల్ విత్ ది నీడిల్’ (పోలండ్), ‘ఐయామ్ స్టిల్ హియర్’ (బ్రెజిల్), ‘ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్’ (జర్మనీ), వెర్మిగ్లియో (ఇటలీ) ఉన్నాయి.
- ఫ్రాన్స్ సినిమా ఎమీలియా పెరెజ్‌లో యాక్ట్ చేసిన నటి జో సల్దానాకు బెస్ట్ సపోర్టింగ్ నటిగా అవార్డు వచ్చింది.
- ఎమీలియా పెరెజ్ మూవీలోని ‘ఎల్ మాల్’ అనే పాటకు ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చింది. దీన్ని పాడిన కెమైల్ డాల్మాయిస్ ఈ అవార్డును అందుకున్నారు.
- ఉత్తమ నటుడిగా అమెరికాకు చెందిన సెబాస్టియన్ స్టాన్ ఎంపికయ్యారు. ఆయన ‘ఎ డిఫరెంట్ మ్యాన్’ అనే సినిమాలో నటించారు.
- ఉత్తమ యానిమేటెడ్ మూవీ పురస్కారాన్ని లాత్వియా దేశ సినిమా ‘ఫ్లో’ కైవసం చేసుకుంది. దీన్ని ఆ సినిమా ప్రొడ్యూసర్ జింట్స్ జిల్బాలోదిస్ అందుకున్నారు. ఒక నల్ల పిల్లికి సంబంధించిన యానిమేటెడ్ క్యారెక్టరు ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ పిల్లి చుట్టూ ఈ సినిమా కథ ఆద్యంతం నడుస్తుంది.