Ameesha Patel బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు చట్టపరమైన ఇబ్బంది ఎదురైంది. 2017లో జరిగిన ఒక వివాహ వేడుక ఈవెంట్‌కు సంబంధించిన గొడవలో ఆమెకు వ్యతిరేకంగా మొరాదాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2017లో ఆ వివాహ వేడుకలో ప్రదర్శన ఇవ్వడానికి అమీషా రూ14.50 లక్షల అడ్వాన్స్ తీసుకున్నారని, కానీ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆమెపై ఈవెంట్ ఆర్గనైజర్ పవన్ వర్మ ఫిర్యాదు చేశాడు. తర్వాత ఆ డబ్బు తిరిగి ఇవ్వడానికి ఆమె ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ క్రమంలో అమీషా పటేల్ వరుసగా కోర్టు విచారణలకు గైర్హాజరు అయింది. దీంతో, కోర్టు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్చి 27న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. కానీ, ఆమె విచారణకు హాజరుకాలేదు. దీంతో, ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు.
మరోవైపు, ఈ అంశంపై అమీషా పటేల్ సోషల్ మీడియాలో స్పందించారు. “ఇది చాలా పాత విషయం… ఇప్పటికే సెటిల్ అయిన కేసు” అని స్పష్టం చేశారు. తాము సెటిల్‌మెంట్ అగ్రిమెంట్ మీద సంతకం చేసి, పవన్ వర్మకు అడిగిన మొత్తం చెల్లించామని తెలిపారు. ప్రచారం కోసం, డబ్బుల కోసమే ఆయన ఇప్పుడు అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ లాయర్లు పవన్ వర్మపై చీటింగ్ కేసు పెట్టబోతున్నారని కూడా వెల్లడించారు. గతంలో కూడా రాంచీ, ఇతర ప్రాంతాల్లో అమీషా చెక్ బౌన్స్ కేసులు ఎదుర్కొన్నారు.
