Megastar Chiranjeevi: ‘గాడ్ ఫాదర్’ – మరో మెగా ఇన్నింగ్స్ కి నాంది!

Megastar Chiranjeevi: నాలుగు దశాబ్దాలు దాటిన చిరంజీవి సినిమా ప్రయాణంలో తనలోని సంపూర్ణ నటుడు తెర మీద ఆవిష్కృతమైన సినిమాలేవీ వాణిజ్యపరంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 08:48 PM IST

Megastar Chiranjeevi: నాలుగు దశాబ్దాలు దాటిన చిరంజీవి సినిమా ప్రయాణంలో తనలోని సంపూర్ణ నటుడు తెర మీద ఆవిష్కృతమైన సినిమాలేవీ వాణిజ్యపరంగా అనుకున్న ఫలితాలు సాధించలేదు. ఆ కారణంగా తనతో సినిమాలు చేసే నిర్మాతల్ని, తన సినిమాలపై జరిగే వ్యాపారాన్ని, తన నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్న అంశాల్ని దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలకు దూరంగా ఉంటూ చిరంజీవి సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది, నిజానికి సినిమా ప్రేక్షకుల్లో నెలకో కొత్త తరం వస్తోంది. భాషతో నిమిత్తం లేకుండా ప్రపంచ దేశాల్లో విడుదలయ్యే ఏ సినిమానైనా సరే మన ఇళ్ళల్లో కూర్చుని ఓటీటీ ద్వారా చూడగలిగే సౌలభ్యమూ ప్రేక్షకులకు కలిగింది. కోవిడ్ కారణంగా కోలుకోలేని విధంగా దెబ్బ తిన్న వాటిలో సినిమా థియేటర్ రంగం ఒకటి.

సమాజంలో వేగంగా మారిన ఇన్ని పరిస్థితుల మధ్యలో థియేటర్లలో విడుదలై, ఆ తర్వాత ఓటీటీ సదుపాయం ఉన్న అందరి ఇళ్ళల్లో అందుబాటులో ఉన్న ‘లూసిఫర్’ అనే మలయాళ సినిమాను చిరంజీవి హీరోగా తెలుగులోకి రీమేక్ చేయాలనే ఆలోచన ఒక విధంగా సాహసమే . ‘మెగాస్టార్’ సినిమాల్లో తప్పక ఉండే డ్యాన్సులు, ఫైట్లు, కామెడీ తదితర వాణిజ్య హంగులు లేని సినిమాను రీమేక్ అనగానే మాతృకను చూసిన చిరంజీవి అభిమానుల్లో కొందరు ఉత్సాహపడితే, మరికొందరు ఉత్కంఠకు లోనయ్యారు.

ఏది ఏమైనా – చిరంజీవికి తగ్గట్టు, ఆయన అభిమానులకు నచ్చేలా, సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా మాతృక లోని హీరో పాత్ర తాలూకు ఔన్నత్యం దెబ్బతినకుండా దర్శకుడు, రచయిత కలిసి ‘గాడ్ ఫాదర్’ సినిమా స్క్రిప్టును, బ్రహ్మ గా చిరంజీవి పాత్రను మలిచారు.
‘గాడ్ ఫాదర్’గా బ్రహ్మ పాత్రలో చిరంజీవి నయనాభినయ కౌశలం – తన కోసం ఇక పై సరికొత్త పాత్రలు సృష్టించమని పాత, కొత్త, వర్ధమాన, రాబోయే రచయితలకు ‘మెగాస్టార్’ విసిరిన ‘ఛాలెంజ్’ అనిపించింది.

చనిపోయిన తన తండ్రికి నివాళులు అర్పించడానికి వచ్చిన బ్రహ్మ(చిరంజీవి)ను పరామర్శించే వంకతో కొందరు రాజకీయాలు చేయజూసే సన్నివేశంలో – తండ్రి లేడన్న ఆవేదనను, పదవి గురించి ప్రస్తావించిన వ్యక్తి పై ఆవేశాన్ని, జరుగుతున్న పరిణామాల పట్ల అసహ్యాన్ని పార్టీలో పరిణామాల దృష్ట్యా పథకం ప్రకారం సొంత చెల్లెలికే ఇబ్బంది కలిగే పరిస్థితుల్ని సృష్టించి అంతా తాను అనుకున్నట్టే జరుగుతున్నందుకు తన సంతృప్తిని, ఆ పరిస్థితుల్ని చేధించి తన అంచనాలు అందుకున్న చెల్లెలి పట్ల తన గర్వాన్ని, సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళే ఇంటర్వెల్ సన్నివేశంలో బ్రహ్మపైన విజయం సాధించేశాడనే భ్రమల్లో జై (సత్యదేవ్) మాటలకు సమాధానంగా తన వెటకారాన్ని, జై ఇచ్చిన ఆఫర్ ని తిరస్కరిస్తూ తన ధిక్కారాన్ని… ఆయా సన్నివేశాల్లో రెప్పపాటు వ్యవధిలో ఇన్ని హావభావాల్ని కేవలం తన కళ్ళతోనే పలికిస్తూ ఇటు అభిమానులకు, అటు సినిమా ప్రేక్షకులకు సరికొత్త చిరంజీవిగా పరిచయమయ్యాడు. బ్రహ్మ పాత్రలో చిరంజీవి నట వైదుష్యానికి పైన చెప్పినవి కేవలం ఉదాహరణలు మాత్రమే… ఒక్క మాటలో ‘గాడ్ ఫాదర్’ – మరో మెగా ఇన్నింగ్స్ కి నాంది !
జై చిరంజీవ !