అన్నయ్య కు గిన్నిస్ అవార్డు దక్కడం పట్ల తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి కి వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కడంతో మెగా అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం అభినందనలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటూ చిరంజీవి కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఖాతాలో ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ , రికార్డ్స్, రివార్డ్స్ చేరిన విషయం తెలిసిందే. సినిమాల్లో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. దీంతో వరల్డ్ ఫేమస్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు దక్కింది. చిరంజీవి 46 సంవత్సరాల కాలంలో 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డ్యాన్స్ మూవ్స్ చేశారు. ఇలా సినిమాల్లో ఎక్కువగా డాన్స్ వేసిన వన్ అండ్ ఓన్లీ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు పురస్కారం అందించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి కుటుంబ సభ్యులు, మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ పాల్గొన్నారు. నిర్మాతలు అల్లు అరవింద్, సురేశ్ బాబు, సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు, డైరెక్టర్ బాబీ తదితరులు హాజరయ్యారు.
ఈ అవార్డు దక్కడం పట్ల మెగా తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లు అన్నయ్య కు అభినందనలు తెలిపారు. ‘గిన్నిస్ బుక్ లో సినిమా సంబంధిత రికార్డ్స్ ఎక్కువగా చూడలేదు. అద్భుతమైన సినిమా సెట్స్, బాండ్ చిత్రాలకు సంబంధించి కొన్ని రికార్డులు ఉన్నాయి. కానీ అన్నయ్య 153 సినిమాల్లో 537 పాటల్లో 24వేల డాన్స్ మూమెంట్స్ చేసి ఈ రికార్డు సాధించినందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ALL THE BEST’ అని నాగబాబు ట్వీట్ చేశారు.
‘అన్నయ్యకు సినీ ప్రపంచంలో రికార్డులు, విజయాలు కొత్త కాదు. ఈరోజు ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. 156 చిత్రాలు, 537 పాటలు, 24వేల స్టెప్స్ అలరించిన నటుడిగా నిలవడం ఎంతో సంతోషం కలిగించింది. ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి దర్శక ధీరుడు రాజమౌళి అభినందనలు తెలియజేశారు. తన కెరీర్లో 24 వేల డాన్స్ మూవ్స్ చేశారని ఇప్పుడే చదివినట్లు ట్వీట్ చేశారు. 46 ఏళ్ల అసాధారణ ప్రయాణం అద్భుతమని కొనియాడారు. భారత చిత్ర సీమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటుడిగా గిన్నిస్ రికార్డు సాధించినందుకు కంగ్రాట్స్ తెలిపారు.
Read Also : Coconuts Price : కొబ్బరికాయల ధర డబుల్.. ఏపీ రైతుల ఆనందం