Sandhya Theater Stampede : సంధ్య థియేటర్ తొక్కిసలాట ,సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనల నేపథ్యంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలువనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు సినీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి తో భేటి కానున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం టాలీవుడ్ పెద్దలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఇదే విషయాన్ని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ఛైర్మన్,నిర్మాత దిల్ రాజు తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనతో పాటు మరికొన్ని ఇతర అంశాలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న భారీ బడ్జెట్ చిత్రాల నేపథ్యంలో బెన్ ఫిట్ షోలు, టికెట్ల పెంపు అంశాలపై కూడా రేవంత్ తో సీని ప్రముఖులు చర్చించనున్నారు. హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న టాలీవుడ్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సినీ ప్రముఖులంతా కలిసి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతామని చెప్పారు.టీఎఫ్ డీసీ తరఫున ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఈ రోజు ఉదయం కన్ఫర్మ్ అయిందని, టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్ చేస్తున్నామని చెప్పారు.
ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కొనసాగేలా చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వంతో ఇండస్ట్రీ సత్సంబంధాలు కొనసాగేలా ఈ సమావేశం ఉంటుందని అన్నారు. రేపు సీఎంతో మీటింగ్ అయిన తర్వాత అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని అన్నారు. అల్లు అరవింద్, సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్ కలిసి రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు ఇచ్చారని, అది వారి కుటుంబానికి, పిల్లల చదువులకు ఉపయోగపడేలా వారికి అందజేస్తానని తెలిపారు. ఈ రోజు కూడా శ్రీతేజ్ రికవరీ ఫాస్ట్ గా ఉంది అని…వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా 72 గంటల పాటు ఉన్నాడని చెప్పారు.
Read Also: Chiranjeevi : ఏంటీ.. చిరంజీవి ఏజ్ రివర్స్‌లో వెళ్తోందా..?