Shah Rukh Khan : రూ.50 లక్షలు ఇవ్వకుంటే.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరింపు మెసేజ్‌ను పంపిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి పేరు మహ్మద్ ఫైజాన్ ఖాన్. అతడు ఒక లాయర్. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఉన్న అతడి నివాసానికి వెళ్లి పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికిి గత వారం బెదిరింపు మెసేజ్ పంపిన వెంటనే మహ్మద్ ఫైజాన్ ఖాన్ లొకేషన్‌ను పోలీసులు విజయవంతంగా ట్రాక్ చేశారు. అతడొక న్యాయవాది అని గుర్తించారు. దీంతో విచారణ కోసం తమ ఎదుట హాజరుకావాలని ముంబై పోలీసులు మహ్మద్ ఫైజాన్ ఖాన్‌కు సమన్లు ఇచ్చారు. అయితే అతడు ఆ సమన్లను బేఖాతరు చేశాడు. దీంతో నేరుగా రాయ్‌పూర్‌లోని నివాసంలో ఫైజాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఫైజాన్ వాదన మరోలా ఉంది. తన ఫోనును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించి ఆ బెదిరింపు మెసేజ్‌ను పంపారని ఫైజాన్ అంటున్నాడు. తన ఫోన్ చోరీకి గురైన అంశంపై నవంబరు 2న పోలీసులకు ఫిర్యాదు కూడా చేశానని తెలిపాడు. మొత్తం మీద మహ్మద్ ఫైజాన్ ఖాన్‌పై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని 308(4), 351(3)(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Also Read :Prabodhini Ekadashi : ఇవాళ ‘ప్రబోధిని ఏకాదశి’.. దీని ప్రత్యేకత, పూజా విధానం వివరాలివీ
షారుఖ్ ఖాన్‌కు(Shah Rukh Khan) గత అక్టోబర్ నెలలోనూ ఒకసారి హత్య బెదిరింపు వచ్చింది. ‘పఠాన్’, ‘జవాన్’ సినిమాలు సక్సెస్ అయిన తర్వాత ఆ బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు ఆయనకు సెక్యూరిటీని పెంచారు. వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించారు. ఇందులో భాగంగా అను నిత్యం షారుఖ్ చుట్టూ ఆరుగురు సాయుధ భద్రతా సిబ్బంది ఉంటారు. అంతకుముందు ఆయన వెంట కేవలం ఇద్దరు భద్రతా సిబ్బంది ఉండేవారు. ఇక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు కూడా భారీ భద్రత కల్పిస్తున్నారు.