Kothapalli Lo Okappudu: ట్రైలర్‌తో ఆకట్టుకుంటున్న ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’

Kothapalli Lo Okappudu: ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ పరుచూరి ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Kothapalli Lo Okappudu

Kothapalli Lo Okappudu

Kothapalli Lo Okappudu: ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రవీణ పరుచూరి ఇప్పుడు దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ గ్రామీణ నేపథ్య చిత్రం జూలై 18న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి నిర్మాతగా వ్యవహరిస్తుండడం మరో విశేషం.

ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆయన రామకృష్ణ అనే పాత్రలో కనిపించనున్నారు. కథ ప్రకారం, రామకృష్ణ ఓ చిన్న పట్టణంలో డ్యాన్స్ స్టూడియో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. అతని జీవితంలో సావిత్రి అనే యువతి ప్రవేశిస్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించనట్లు కనిపిస్తుంది. కానీ ఓ రోజు సావిత్రి అతన్ని “గడ్డివాము” వద్ద కలవమని అడిగిన వెంటనే కథ మలుపు తిరుగుతుంది. అక్కడినుంచి రామకృష్ణ జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.

ట్రైలర్ చూస్తే ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు, మిస్టరీ, మానవ సంబంధాలు, దైవిక అనుభూతుల మేళవింపుతో నడిచే కథ అని స్పష్టమవుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి అనుగుణంగా నటీనటులు తమ పాత్రల్లో జీవించారు. మనోజ్ చంద్ర, మోనికా వంటి నటులు కూడా ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వారి నటనలో కనిపించే అమాయకత్వం ప్రేక్షకుల మనసు దోచేలా ఉంది.

ట్రైలర్ నాన్ స్టాప్ కామెడీ, ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. అదే తరహాలో సినిమా కూడా భిన్నమైన అనుభూతిని అందిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’ చిత్రబృందం అందించిన ఈ నూతన ప్రయోగం, కథ చెప్పే విధానం ప్రేక్షకులను కొత్తగా భావించేలా చేస్తుందని సినిమా వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Swift: ఈ నటి దగ్గర లంబోర్గిని ఉన్నప్పటికీ స్విఫ్ట్ వాడుతోంది ఎందుకు..?

  Last Updated: 10 Jul 2025, 04:52 PM IST