సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ల వివాహం గురించి సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తికరమైన వార్త తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ తమిళ సినిమా వర్గాల్లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్-2’ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాతే వీరి వివాహ వేడుకలు ఉంటాయని కోలీవుడ్ మీడియా పేర్కొంటోంది. అక్టోబర్ 15వ తేదీన ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుండగా, ఆ తర్వాత నవంబర్ రెండో వారంలో ఈ క్రేజీ జోడీ వివాహ బంధంతో ఒకటి కానున్నట్లు సమాచారం.
ఇప్పటికే అనిరుధ్, కావ్య మారన్ల రిలేషన్‌షిప్‌పై గతంలోనూ పలుమార్లు పుకార్లు షికార్లు చేసినప్పటికీ, ఈసారి ఏకంగా పెళ్లి ముహూర్తం నెలకు సంబంధించిన వార్తలు రావడం గమనార్హం. అయితే, ఈ వైరల్ అవుతున్న పెళ్లి వార్తలపై అటు అనిరుధ్ రవిచందర్ కానీ, ఇటు కావ్య మారన్ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇది కేవలం పుకారా లేక నిజంగానే ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారా అనే విషయంపై అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రేజీ వెడ్డింగ్ రూమర్స్‌పై మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
