Celebrity Restaurants: సినీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు వేరే వ్యాపారాలు చేయొద్దనే రూలేం లేదు. ఎవరైనా, ఏదైనా వ్యాపారం చేయొచ్చు. ఎంతోమంది సినీ తారలు రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఫిట్‌నెస్ సెంటర్లు, విద్యాసంస్థలు వంటివి నడుపుతుంటారు. తాజాగా ఈ లిస్టులో ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేశారు. ఆమె ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాజా అప్‌డేట్ ఏమిటంటే.. ఆమె హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర నగరం మనాలీలో ఒక కేఫ్‌ను తెరిచారు. దీనికి ‘ది మౌంటైన్ స్టోరీ’ అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ కేఫ్‌ను కంగన స్వయంగా సందర్శించారు. ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలో మన హైదరాబాద్‌లో ఉన్న పలువురు సినీ ప్రముఖుల(Celebrity Restaurants) రెస్టారెంట్ల గురించి తెలుసుకుందాం..
Also Read :Krishnaveni : ‘ఎన్టీఆర్’ను ‘మనదేశం’తో పరిచయం చేసిన కృష్ణవేణి ఇక లేరు.. జీవిత విశేషాలివీ
మహేష్ బాబు : AN రెస్టారెంట్
లొకేషన్ : బంజారాహిల్స్, హైదరాబాద్
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ 2022 డిసెంబర్ 8న AN రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఇందుకోసం వారు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ మినర్వా గ్రూప్, ఆసియన్ ఫుడ్ గ్రూపులతో చేతులు కలిపారు. ఈ రెస్టారెంట్‌లో అద్భుతమైన ఇంటీరియర్స్, అత్యున్నత స్థాయి సేవలు, వివిధ రకాల ప్రపంచ స్థాయి వంటకాల మెనూ అందుబాటులో ఉంటుంది. ఇది బంజారా హిల్స్ ప్రాంతంలో ఉంది.
విరాట్ కోహ్లీ : వన్ 8 కమ్యూన్
లొకేషన్ : హైటెక్ సిటీ, హైదరాబాద్
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య, నటి అనుష్క శర్మతో కలిసి ‘వన్ 8 కమ్యూన్’ పేరుతో కొన్నేళ్ల క్రితం రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పూణే, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో ఈ రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు. 2024 మే 24న మన హైదరాబాద్‌లో కూడా ఈ రెస్టారెంటును ప్రారంభించారు. వన్ 8 కమ్యూన్‌లో అద్భుతమైన ఇంటీరియర్స్ ఉంటాయి. గౌర్మెట్ ఫుడ్, ప్రత్యేకమైన పానీయాలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఉత్సాహభరితమైన భోజనం లభిస్తుంది.
రకుల్ ప్రీత్ : ఆరంభం
లొకేషన్ : మాదాపూర్, హైదరాబాద్
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్‌లో మిల్లెట్ ఆధారిత రెస్టారెంట్ ‘ఆరంభం’ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం క్యూర్‌ఫుడ్స్ సంస్థతో ఆమె చేతులు కలిపారు. సాంప్రదాయ భారతీయ వంటకాలలో మిల్లెట్‌లను జోడించి అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత . రుచి విషయంలో రాజీ పడకుండా ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన భోజనాన్ని తినాలని భావించే వారికి ‘ఆరంభం’ మంచి ప్లేస్.
అల్లు అర్జున్ : హైలైఫ్
లొకేషన్ : జూబ్లీహిల్స్, హైదరాబాద్
ప్రముఖ నటుడు అల్లు అర్జున్, అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ ‘ఎం కిచెన్’, కేదార్ సెలగంశెట్టి భాగస్వామ్యంతో 2016లో హైలైఫ్ బ్రూయింగ్ కంపెనీని ప్రారంభించారు. ఇందులో లైవ్‌లో డీజే కన్సర్ట్స్ నిర్వహిస్తుంటారు. విస్తృతమైన పానీయాల మెనూ ఇక్కడ అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌లో పార్టీలు చేసుకునే వారికి ఇది స్వర్గధామం లాంటిది.
అక్కినేని నాగార్జున : N గ్రిల్ & N ఏషియన్
లొకేషన్ : జూబ్లీహిల్స్, హైదరాబాద్
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున 2014లో ప్రీతం రెడ్డితో కలిసి N గ్రిల్ అండ్ N Asian రెస్టారెంట్లను ప్రారంభించారు. N గ్రిల్ అనేది వివిధ రకాల గ్రిల్డ్ రుచికరమైన వంటకాలను అందించే ఆధునిక స్టీక్‌హౌస్. ఇక N Asian అనేది చైనీస్ వంటకాలలో ప్రత్యేకత కలిగిన విభాగం. ఈ రెండు రెస్టారెంట్లు వాటి వైవిధ్యభరితమైన మెనూకు పేరుగాంచాయి. ఇవి భారతీయ, ఇటాలియన్, పాన్ ఆసియన్, మెడిటరేనియన్ వంటకాలను అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రీమియం డైనింగ్ అనుభవాన్ని కోరుకునే ఆహార ప్రియులకు ఈ రెస్టారెంట్లు బెస్ట్.
నాగ చైతన్య : షోయు
లొకేషన్ : జూబ్లీహిల్స్, హైదరాబాద్
హీరో నాగ చైతన్య కూడా రెస్టారెంట్ వ్యాపారంలోకి వచ్చారు. ఆయన షోయు పేరుతో రెస్టారెంట్ పెట్టారు. ఇది క్లౌడ్ కిచెన్ సర్వీసులు అందిస్తుంది. వివిధ రకాల పాన్-ఆసియన్ వంటకాలను కూడా ఇది సమకూరుస్తుంది. స్విగ్గీ సహకారంతో షోయు పనిచేస్తుంటుంది. హైదరాబాద్ చుట్టూ రుచికరమైన జపనీస్ భోజనాలను అందించడంలో షోయు బాగా ఫేమస్. ప్యాకేజింగ్, పర్యావరణ అనుకూల విధానాలతో ఇది మంచి పేరు సంపాదించింది.