Oscars : భారతీయ చిత్ర పరిశ్రమకు గౌరవం కలిగించే సంఘటనగా, ప్రముఖ నటులు కమల్ హాసన్ , ఆయుష్మాన్ ఖురానా ఆస్కార్ అకాడమీ సభ్యత్వానికి ఆహ్వానం అందుకున్నారు. ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత గుర్తింపులలో ఒకటైన ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించిన 2025 సంవత్సరానికి కొత్త సభ్యుల జాబితాలో వీరి పేర్లు చోటు చేసుకున్నాయి.
ఈ ఏడాది మొత్తం 534 మంది ప్రతిభావంతులను ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల నుంచి అకాడమీకి ఆహ్వానించింది. భారత్ నుంచి ఈ గౌరవం అందుకున్న వారిలో కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా తో పాటు, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందిన దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు ఉన్నారు. సభ్యత్వం పొందిన వారంతా ఆస్కార్ అవార్డుల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనగల హక్కును పొందుతారు. ఇది నామినేషన్ల నుండి తుది విజేతల ఎంపిక వరకు అమలులో ఉంటుంది.
ఇక ఆస్కార్ అకాడమీ ఈ ఏడాది మొత్తం 19 విభిన్న విభాగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించినట్లు తెలిపింది. విశేషంగా, ఈ కొత్త సభ్యులలో 41 శాతం మహిళలు ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఇది వైవిధ్యాన్ని ప్రోత్సహించే అకాడమీ యత్నాల్లో ఒక భాగమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇంతలో, 2026 ఆస్కార్ అవార్డుల ప్రధాన వేడుక వచ్చే ఏడాది మార్చి 15న జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ జనవరి 12 నుండి 16 వరకు జరుగుతుంది. తుది జాబితా జనవరి 22న ప్రకటించనున్నారు.