ప్రముఖ నటుడు జగపతిబాబు (Jagapathi Babu) అవార్డులపై చేసిన ఒక సరదా పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన కన్నడ సినిమా ‘కాటేరా’ (Kaatera ) లో చేసిన విలన్ పాత్రకు IIFA అవార్డు (IIFA Award) లభించింది. ఈ అవార్డును దుబాయ్లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. అవార్డు అందుకున్న వీడియోను జగపతిబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను పంచుకుంటూ ఆయన సరదాగా రాసుకొచ్చారు: “ఎంత వెదవలా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి.” ఈ వ్యాఖ్యతో తన ప్రతిభకు అందిన గుర్తింపును సరదాగా వ్యక్తం చేశారు. ఈ పోస్టు అభిమానులను ఆకట్టుకోగా, జగపతిబాబు చేసిన చమత్కార వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది.
జగపతిబాబు కెరియర్ విషయానికి వస్తే.. సౌత్ లోనే కాదు అన్ని భాషల సినీ పరిశ్రమలో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో, ప్రాచుర్యం పొందిన నటుడు. 1962 ఫిబ్రవరి 12న చెన్నైలో జన్మించిన జగపతిబాబు, తన కెరీర్‌ను 1989లో ప్రారంభించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక సినిమాల్లో నటించారు. 1992లో వచ్చిన ‘పెళ్లి పందిరి’ సినిమాలో హీరోగా నటించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. కుటుంబ కథా చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరైన జగపతిబాబు, తర్వాతి దశలో విలన్ పాత్రల్లోకి మారి తన నటనలో విభిన్నతను చాటారు. 2014లో వచ్చిన ‘లెజెండ్’ చిత్రంలో నెగటివ్ రోల్‌లో నటించి, తన కొత్త అవతారంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ‘లెజెండ్’, ‘రంగస్థలం’, ‘సరైనోడు’, ‘కాటేరా’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు.
తన నటనకు గాను పలు నంది అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. తాజాగా ‘కాటేరా’ సినిమాకు గాను IIFA అవార్డు పొందడం ద్వారా జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందారు. దర్శన్ హీరోగా నటించిన కన్నడ మూవీ కాటేరా. గత డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించగా , ఆరాధన రామ్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ లో దేవరాయ పాత్రలో జగతి బాబు నటించారు.
Read Also : KTR : తెలంగాణలో శాంతి భద్రతలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు