నాగార్జునను ఆయన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాగే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు కార్తీక్ తెలిపారు. గతంలో నాగార్జున కెరీర్‌లో కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిన శివ, రక్షకుడు వంటి చిత్రాల్లో కనిపించిన పవర్‌ఫుల్, స్టైలిష్ అవతారంలో ఆయన మరోసారి దర్శనమివ్వనున్నారని స్పష్టం చేశారు. అలాగే కథానుసారం ఈ సినిమాలో నాగార్జున ఏకంగా మూడు విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తారని చెప్పడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ సినిమా కోసం నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని, ఆయన లుక్ అభిమానులకు పండగలా ఉంటుందని దర్శకుడు హామీ ఇచ్చారు.
అయితే, ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన 100వ సినిమాకు ఓ స్టార్ డైరెక్టర్‌ను కాకుండా, అనుభవం తక్కువ ఉన్న తమిళ దర్శకుడిని ఎంచుకోవడంపై చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తాను కూడా నాగార్జునను అడిగానని కార్తీక్ వెల్లడించారు. “నాగార్జున గారితో సినిమా చేయడానికి చాలా మంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. మంచి కథలతో వస్తుంటారు. అలాంటిది ఈ అవకాశం నాకు ఎలా ఇచ్చారని అడిగాను. దానికి ఆయన ‘కథ నచ్చితే చాలు.. నేను గత 40 ఏళ్లుగా కొత్త దర్శకులతో పనిచేస్తున్నాను’ అని సింపుల్‌గా సమాధానమిచ్చారు” అని కార్తీక్ వివరించారు.
గతంలో కూడా నాగార్జున మణిరత్నం (గీతాంజలి), ప్రియదర్శన్ వంటి ఇతర భాషల దర్శకులతో పనిచేసి బ్లాక్‌బస్టర్లు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక, ఈ సినిమాలో నాగార్జునకు జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. వారిలో సీనియర్ నటి టబు ఓ కీలక పాత్ర పోషిస్తుండగా, ‘నాట్యం’ ఫేమ్ సుస్మిత భట్ మరో కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. ఈ తాజా అప్‌డేట్స్‌తో ‘కింగ్ 100’పై అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
