Singer Mangli: అరసవల్లి దేవాలయం వివాదంపై సింగర్ మంగ్లీ (Singer Mangli) తాజాగా స్పందించారు. అరసవల్లి దేవాలయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి దర్శనంపై చాలా మంది విమర్శించడం బాధ కలిగించిందన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన కొందరు లీడర్లు సంప్రదిస్తే పాటపాడాను అని క్లారిటీ ఇచ్చారు. దాని తర్వాత రెండు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశానని, అక్కడి స్థానిక నేతలు వ్యక్తిగతంగా తెలిసిన కారణంగా ప్రచారంలో పాల్గొనాల్సి వచ్చింది కాని ఇతర పార్టీలకు సంబంధించిన ఎవరినీ ఒక్క మాట అనలేదు, దూషించలేదని మంగ్లీ అన్నారు.
మంగ్లీ మాట్లాడుతూ.. నేను ఎక్కడా పార్టీ జెండా ధరించలేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అప్పటి పరిస్థితుల్లో ఒక కళాకారిణిగా పాడాను. వైఎస్సార్సీపి ఒక్కటే కాదు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతో పాటు దాదాపు అన్ని పార్టీల లీడర్లకు పాటలు పాడాను. అప్పటికే నాపై రాజకీయ పార్టీ ముద్ర పడటంతో మిగతా పార్టీలకు చెందిన వాళ్లకు నా పాట దూరమయ్యింది. దీంతో చాలా అవకాశాలు కోల్పోయాను. అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ కారణంగానే 2024 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపితో పాటు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారపాటలు పాడాలని కోరినా సున్నితంగా తిరస్కరించాను. ఒక కళాకారిణీగా గుర్తించి ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ఛానల్ అధికారులు నన్ను సంప్రదించారు. నేను ఆ పదవి స్వీకరించాలా వద్దా అని చాలా రోజులు తర్జన భర్జన పడ్డాను. ఇది రాజకీయ పదవి కాదని, అప్పటికే చాలా మంది కళాకారులు సలహాదారులుగా చేశారని నా శ్రేయోభిలాషులు సూచించారు. పైగా మా ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఆ పదవిని కొనసాగించానే తప్ప ఎక్కడా బహిరంగంగా ఆ పదవి గురించి ప్రకటించుకోలేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
Also Read: Food Subsidies: కేంద్రం సబ్సిడీలపై సంచలన నివేదిక.. హైరేంజులో ఆహార సబ్సిడీలు
ఇంకా మాట్లాడుతూ.. నేను పాటను నమ్ముకునే వచ్చాను కానీ పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదని వేడుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడుని నేను ఎక్కడా అనని మాటలను, ఆధారాలు లేకుండా వాస్తవాలు తెలీకుండా కొందరుకావాలనే రాజకీయ లబ్ది కోసం ఫేక్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబుకి నేను పాట పాడను అన్నది ముమ్మాటికి వాస్తవం కాదని ప్రమాణం చేసి చెబుతున్నాను. మొదట్లో వైసీపీకి పాడిన కారణంగానే కావొచ్చు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరూ కూడా నన్ను సంప్రదించలేదు. దేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం కలిగిన అంతపెద్ద మనిషిని నేను అంతమాట అన్నానని ప్రచారం చేయడం న్యాయమేనా? అని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లోని వీడియో క్లిప్పులతో రాజకీయ పార్టీలకు ముడిపెట్టి నాపై విష ప్రచారం చేస్తున్నారు. ఒక గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నాలాంటి బలహీనురాలిపై ఇలాంటి వ్యతిరేక ప్రచారం చేయటం చాలా బాధాకరం. నాకు ఎలాంటి రాజకీయ అభిమతాలు కానీ.. పక్షపాతాలు కానీ లేవు.. నేను ఏ పార్టీ ప్రచార కార్యకర్తను కాను. అందరు నాయకులపై నాకు గౌరవం ఉంది. ప్రతి ఒక్కరూ నాకు ఆదర్శనీయులు. నేను హాజరయ్యే కార్యక్రమాలు కేవలం కళాదృష్టితోనే చూడమని వేడుకుంటున్నాను అని మంగ్లీ వేడుకున్నారు.