Puneeth Rajkumar : హీరో పునీత్ ద‌శ‌దిన క‌ర్మ‌లో `జ‌గ‌మంత` కుటుంబం

క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ మాన‌సికంగా కొన్ని ల‌క్ష‌ల మంది గుండెల్లో గుడిక‌ట్టుకున్నాడు. ద‌శ‌దిన క‌ర్మ సంద‌ర్భంగా పునీత్ కుటుంబం అభిమానుల‌పై చూసిన ప్రేమ, అభిమానాన్ని కొల‌వ‌లేం.

  • Written By:
  • Updated On - November 15, 2021 / 02:07 PM IST

క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా లేక‌పోయిన‌ప్ప‌టికీ మాన‌సికంగా కొన్ని ల‌క్ష‌ల మంది గుండెల్లో గుడిక‌ట్టుకున్నాడు. ద‌శ‌దిన క‌ర్మ సంద‌ర్భంగా పునీత్ కుటుంబం అభిమానుల‌పై చూసిన ప్రేమ, అభిమానాన్ని కొల‌వ‌లేం. ఇది వార్తలాగే అనిపించదు బహుశా… కానీ చెప్పుకోవాలి…పునీత్ ను కన్నడంలో అప్పు అనీ, పవర్ స్టార్ అని పిలుచుకునేవాళ్లు… చాలామంది స్టార్లలో తనూ ఒకడు… పైగా ఓ లెజెండ్ వారసుడు… అన్నలిద్దరూ నటులే, ఇండస్ట్రీలోనే ఉన్నారు… పునీత్‌కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు.

పునీత్ సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ అభిమానించేవాళ్లు… నిజానికి పునీత్ మరణం తరువాతే జనంలో తనంటే ఇంతగా విపరీతమైన ప్రేమ ఉన్నట్టు బయటపడింది… అక్కడక్కడా పలువురు అభిమానులు చనిపోతున్నారనే సమాచారం వచ్చినప్పుడు పునీత్ భార్య ఓ ప్రకటన జారీ చేసింది… ‘పునీత్ దూరమైన బాధలో ఉన్నాం మేం… మీరూ దూరమై మీ కుటుంబాలను బాధలో పడేయకండి..అది మాకూ బాధే’’అదీ ఫ్యాన్స్ పట్ల కనబరిచిన సానుభూతి.
పునీత్ భౌతికదేహాన్ని చూడటానికి వచ్చిన లక్షల మందిని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. ఒక సినిమా నటుడికి ఎవరికీ దక్కనంత ఘనమైన నివాళి… అంత మంది వచ్చినా సరే ఎక్కడా చిన్న అలజడి లేదు, మర్యాదగా, పద్ధతిగా చెప్పులు విడిచి, అంతిమ నివాళి అర్పించి క్రమశిక్షణతో వెళ్లిపోయారు. వాళ్లు అభిమానులు అంటే… అదీ అభిమానం అంటే… గ్రేట్.

మరణం తరువాత పదకొండోరోజు… సాధారణంగా దశదినకర్మ రోజు దగ్గరివాళ్లను, బంధువులను, స్నేహితులను పిలుస్తారు. ఆయా కులాల్లో ఆనవాయితీని బట్టి మందు, నాన్ వెజ్ కూడా ఘనంగా ఏర్పాటు చేసి, తమ స్థోమతను బట్టి కర్మ నిర్వహిస్తుంటారు. పునీత్ కుటుంబం ఫ్యాన్స్‌ను కూడా బంధువుల జాబితాలో పరిగణించారు. అందరినీ రమ్మన్నారు. భోజనాల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కుటుంబం కదా.. అన్నలిద్దరూ విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పదకొండు, పన్నెండు గంటలకు మొదలైన భోజనాలు 4-5 గంటల వరకూ కొన‌సాగింది.ఫ్యాన్సే కదా అని తేలికగా చూడలేదు. టేబుళ్ల మీద, అరిటాకులు వేసి, పద్ధతిగా పెట్టారు. ఎవరొస్తే వాళ్లకు… రాష్ట్రంలో దూరప్రాంతాల నుంచి వచ్చి పునీత్ పట్ల తమ ప్రేమను చాటుకున్నారు. వేల మంది బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పొల్గొన్నారు. వేల మంది ఈ ‘ప్రసాదం’ స్వీకరించారు.

Also Read : జూనియ‌ర్ షోలో కోటీశ్వ‌రుడైన పోలీస్ అధికారి

ఇంతమందికి భోజనాల ఏర్పాట్లు అంటే మాటలా..? ఖర్చు సరే, కానీ ఆ ప్రయాస, సరిపడా ప్లానింగ్, ఎవరికీ అసంతృప్తి కలగకుండా చూడటం… పెద్ద టాస్క్…ఏదో వచ్చారు కదాని అల్లాటప్పాగా గుళ్లలో అన్నదానం తరహాలో చేయలేదు. రెండు మూడు టీవీలు చూస్తుంటే కాస్త అర్థమైందేమంటే..ద‌శ‌దిన క‌ర్మ‌కు వ‌చ్చిన అభిమానుల‌కు సోనామశూరి సన్నన్నం, కోడిగుడ్లు, చికెన్ గట్రా… పెళ్లిళ్లలో పెట్టినట్టే తృప్తిగా పెట్టారు…పునీత్ భార్య, ఇద్దరు సోదరులు కూడా వచ్చి అందరినీ పలకరించి వెళ్లారు.‘చాలామందిఎంతో దూరం నుంచి వచ్చారు, అందరూ మా హృదయాలకు దగ్గరే…’అన్నాడు పునీత్ సోదరుడు రాఘవేంద్ర… ‘వీళ్లు లేక మా ఉన్నతి ఎక్కడిది..? వీళ్ల పట్ల కృతజ్ఞులుగా ఉండటమే మేం చేయగలిగేది’ అన్నాడు శివ రాజకుమార్. ఒక దశలో రెండు కిలోమీటర్ల దాకా క్యూ… కానీ పద్ధతి తప్పలేదు ఎవరూ… క్రమశిక్షణతో కదలడం, ఓ హాలులో ఉన్న పునీత్ చిత్రపటానికి దండం పెట్టడం, ఖాళీ ఉన్న కుర్చీల్లో కూర్చోవడం, తినడం, వెళ్లిపోవడం..ఇదీ పునీత్ అభిమానుల క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఫ్యాన్స్ మా కుటుంబసభ్యులు, మా బంధువులు అని సొల్లు కబుర్లు చెప్పే సినిమా కుటుంబాలు బోలెడు… అవసరమొస్తే ఏ ఫ్యాన్‌నూ ఎవడూ దేకడు… కానీ రాజకుమార్ కుటుంబం ఆ స్పిరిట్‌ను చేతల్లో చూపించారు.ఇక్కడ ఖర్చు ఎంతనేది కాదు, ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు అనేది కాదు, నిజంగానే అభిమానుల్ని తమ కుటుంబసభ్యుల్లాగే పరిగణించిన తీరు విశేషం అనిపించింది…!!
పునీత్ మంచిగా బతకడమే కాదు, గొప్పగా వెళ్లిపోయాడు…!! #శివోహం