ప్రముఖ నటి తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. తన అనుమతి లేకుండా ఫోటోలను వాడుకున్నారంటూ ‘పవర్ సోప్స్ లిమిటెడ్’ సంస్థపై ఆమె దాఖలు చేసిన రూ. కోటి నష్టపరిహారం దావాను కోర్టు కొట్టివేసింది. 2008లో కుదుర్చుకున్న ఒప్పందం 2009 అక్టోబర్‌తో ముగిసినప్పటికీ, 2010-2011 కాలంలో కూడా సదరు సంస్థ తన ఫోటోలను సోప్ ప్యాకింగ్‌లు మరియు ప్రకటనల్లో వాడిందని తమన్నా ఆరోపించారు. దీనివల్ల తన బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని, ఇతర ఒప్పందాలకు నష్టం కలిగిందని ఆమె వాదించారు. అయితే, గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, డివిజన్ బెంచ్ తాజాగా ఈ అప్పీల్‌ను తోసిపుచ్చింది.
ఆధారాలు లేవన్న హైకోర్టు
ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు పి. వేల్మురుగన్, కె. గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం తమన్నా వాదనను తోసిపుచ్చింది. కంపెనీ ఉద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను వాడిందని నిరూపించే బలమైన సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. నటి సమర్పించిన సోప్ కవర్లు, కొనుగోలు పత్రాలు నమ్మదగ్గవిగా లేవని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ప్రకటనలు కొనసాగాయనడానికి తగిన ఆధారాలు చూపడంలో విఫలమవడంతో, చట్టపరమైన పోరాటంలో తమన్నాకు నిరాశే ఎదురైంది.
సెకండ్ ఇన్నింగ్స్ జోరు – సిద్ధార్థ్ మల్హోత్రాతో కొత్త సినిమా
కోర్టు కేసుల సంగతి పక్కన పెడితే, తమన్నా కెరీర్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన దశలో ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో ఆమె నటిస్తున్న భారీ చిత్రం ఆగస్టు 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఇదొక పూర్తి స్థాయి ‘ఎమోషనల్ మసాలా ఫిలిం’ అని ఆమె స్వయంగా వెల్లడించారు. వీటితో పాటు సుందర్ సి దర్శకత్వంలో విశాల్ సరసన మరో ప్రాజెక్టుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అటు వెండితెరపై, ఇటు ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌పై బోల్డ్ పాత్రలతో మెప్పిస్తున్న తమన్నా, తన సెకండ్ ఇన్నింగ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నారు.
