Govinda : బాలీవుడ్ నటుడు గోవిందా (60)కు పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఆయన ముంబైలోని జుహూ ఏరియాలో ఉన్న తన నివాసం నుంచి కోల్‌కతాకు బయలుదేరుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన వద్ద ఉన్న లైసెన్స్‌డ్ గన్ ప్రమాదవశాత్తు కిందికి జారిపడి మిస్ ఫైర్ అయింది. దీంతో గోవిందా మోకాలు కింది భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కాలికి గాయమైన వెంటనే గోవిందా ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆ బుల్లెట్‌ను కాలి నుంచి తొలగించారు. ఈ ఘటన జరిగినప్పుడు గోవిందా, ఆయన కుమార్తె టీనా మాత్రమే ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. గోవిందా భార్య సునితా అహుజా ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్నారు. బుల్లెట్ కాలులోకి దూసుకెళ్లిన వెంటనే గోవిందా తన భార్యకు, మేనేజర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలియజేశారు. ఆ వెంటనే జుహూ ఏరియా పోలీసులు అక్కడికి చేరుకొని గోవిందాను(Govinda) ఆస్పత్రికి తీసుకెళ్లారు.
Also Read :Indian Soldiers : లెబనాన్ బార్డర్‌లో 600 మంది భారత సైనికులు.. వాట్స్ నెక్ట్స్ ?
ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గోవిందా ప్రకటించారు. ఈమేరకు ఆయన ఒక ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. తల్లిదండ్రులు, గురువుల ఆశీర్వాదం.. అందరి ప్రేమ ఉండటం వల్లే తాను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డానని గోవిందా చెప్పారు. తనకు మెరుగైన చికిత్సను అందించి బుల్లెట్‌ను తొలగించిన వైద్యులకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. గోవిందా కొన్ని రోజులు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతారని ఆయన మేనేజర్ శశి సిన్హా వెల్లడించారు. ఇవాళ ఉదయం 6గంటల ఫ్లైట్‌లో కోల్‌కతాకు వెళ్లేందుకు గోవిందా రెడీ అవుతుండగా గన్ మిస్ ఫైర్ జరిగిందని ఆయన తెలిపారు. తన భర్తకు జరిగిన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే భార్య సునితా అహుజా కోల్‌కతా నుంచి ముంబైకి బయలుదేరారు. కాగా, ఈ ప్రమాదంపై పోలీసులకు గోవిందా ఫిర్యాదు చేయలేదని తెలిసింది.