Site icon HashtagU Telugu

Producers: యూనియన్ నిబంధనలతో సినిమాలు తీయలేం: నిర్మాతలు

Producers

Producers

Producers: గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో నిర్మాతలు (Producers) తమ సమస్యలను వెల్లడిస్తున్నారు. ఈ సమ్మెను ముగించడానికి తాము సాధ్యమైనంత వరకు సహకరిస్తున్నామని, అయితే 50 ఏళ్ల క్రితం రూపొందించిన యూనియన్ నిబంధనలతో నేటి పరిస్థితుల్లో సినిమాలు నిర్మించడం సాధ్యం కాదని తెలుగు చలన చిత్ర నిర్మాతలు స్పష్టం చేశారు.

వేతనాల పెంపుపై నిర్మాతల అభిప్రాయం

వేతనాలు పెంచాలన్న కార్మికుల డిమాండ్‌పై నిర్మాతలు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ ఇది తమపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పెట్టుబడికి తగినంత ఆదాయం రావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో వేతనాలు పెంచడం చాలా కష్టమని తెలిపారు.

నిర్మాతలు కార్మికులకు ఈ ఏడాది 10 శాతం, ఆ తర్వాత రెండేళ్ల పాటు 5 శాతం చొప్పున వేతనాలు పెంచుతామని ప్రతిపాదించారు. అయితే రోజుకు రూ. 2,000 కంటే ఎక్కువ వేతనాలు తీసుకుంటున్న కార్మికులకు ఇంకా పెంపు కోరడం ఏ మాత్రం సరైనది కాదని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ఇతర చిత్ర పరిశ్రమల్లో కార్మికులకు చెల్లిస్తున్న దానికంటే ఈ పెంపు ఎక్కువగా ఉందని వారు పేర్కొన్నారు.

Also Read: BMW Models: సెప్టెంబర్ 1 నుండి బీఎండ‌బ్ల్యూ కార్ల ధరలు పెంపు!

పని విధానంలో మార్పులు అవసరం

ఒక సినిమా కోసం 24 క్రాఫ్టుల కార్మికులు పనిచేసే విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉందని నిర్మాతలు వాదిస్తున్నారు. 50 ఏళ్ల క్రితం రాసుకున్న పాత యూనియన్ నిబంధనలను నేటి పరిస్థితులకు అనుగుణంగా మార్చకపోతే సినిమా నిర్మాణాలు మరింత క్లిష్టంగా మారతాయని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం సినీ రంగానికి ఒక హబ్‌గా ఎదుగుతోంది. అయితే, కార్మికులు ఇలాంటి కఠినమైన నిబంధనలు విధిస్తే ఇతర భాషల నుంచి మేకర్స్ ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపించరని, తద్వారా పరిశ్రమ అభివృద్ధికి అది అడ్డంకిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త టాలెంట్‌కు అడ్డంకులు

తెలుగు చిత్ర పరిశ్రమ ఒక సృజనాత్మక పరిశ్రమ అని, ఇందులో నైపుణ్యాభివృద్ధితో పాటు కొత్త టాలెంట్ రావాల్సిన అవసరం ఉందని నిర్మాతలు నొక్కి చెప్పారు. అయితే, యూనియన్‌లలో చేరడానికి లక్షలాది రూపాయలు రుసుములు వసూలు చేస్తుండటం వల్ల కొత్త ప్రతిభావంతులు చిత్ర పరిశ్రమలోకి రావడానికి అవరోధంగా మారుతోందని వారు ఆరోపించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సినిమా మేకింగ్‌ను మరింత సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో చేసే మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు.