Mens Day 2024 : ఇవాళ (నవంబరు 19) ‘మెన్స్ డే’. ఈసందర్భంగా లింగ సమానత్వం, మహిళలపై అత్యాచారాలు, లింగ వివక్షకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ నిర్వహించిన సామాజిక కార్యక్రమం ‘మర్ద్’లో స్టార్ హీరో మహేశ్ బాబు భాగస్తులయ్యారు. ఈ ప్రచారంలో భాగంగా ఫర్హాన్ అక్తర్ తండ్రి, రచయిత జావెద్ అక్తర్ హిందీలో రాసిన కవిత తెలుగు వర్షన్‌ను మహేశ్ బాబు స్వయంగా పాడటం విశేషం. ‘‘నేను ‘మర్ద్’ కార్యక్రమంలో భాగమయ్యాను’’ అంటూ మహేశ్ ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ప్రతి మనిషికి గౌరవం, సానుభూతి వంటి కనీస లక్షణాలు ఉండాలి. ఇతరులపై గౌరవం, సానుభూతి చూపాలి. సమానత్వం కోసం నిలబడాలి. చేసే ప్రతి వర్క్‌లో దయాభావాన్ని ప్రదర్శించే వాడే అసలైన పురుషుడు. ఇవాళ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఈసందర్భంగా నాతో పాటు మీరూ మర్ద్‌లో చేరండి’’ అని మహేశ్ బాబు పిలుపునిచ్చారు.
Also Read :PSU Banks : నాలుగు ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాల విక్రయం.. మోడీ సర్కారు సన్నాహాలు
లింగ అసమానత, నేరాలకు వ్యతిరేకంగా ‘మర్ద్’ పేరిట ఫర్హాన్ అక్తర్ ప్రచారాన్ని ప్రారంభించారు. తన భావాలన్నింటినీ ఓ కవితగా మార్చి ప్రచారం చేస్తున్నారు. ఆ కవితనే మహేశ్ తెలుగులో చదివి వినిపించారు. వాస్తవానికి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే మహేశ్ బాబుకు చాలా ఇష్టం. ఇతరులకు సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుందని ఆయన చెబుతుంటారు. ‘మర్ద్’ ప్రచారంలో మహేశ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గాయకుడు షాన్(Mens Day 2024) భాగమయ్యారు. వారంతా ఒక్కో భాషలో ఒక్కో కవితను చదివి వినిపించారు. ‘నేను అద్దంలో చూసుకున్న ప్రతిసారీ.. మా అమ్మ, సోదరి, భార్య, కుమార్తె గర్వంగా ‘ఈయన మా మనిషి’ అని చెప్పుకొనే ఓ వ్యక్తిగా కనిపించాలి’ అని ఫర్హాన్ అక్తర్ చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Also Read :criminal case : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఊరట..క్రిమినల్ కేసు ఎత్తివేత!
మహేశ్ బాబు చదివి వినిపించిన కవిత ఇదీ..
‘‘ఎవరి ప్రవర్తన మంచిగా ఉంటుందో..
ఎవరికి ఆడవారంటే గౌరవం ఉంటుందో..
ఎవరు మహిళల శరీరానికి, ఆత్మకు విలువనిస్తూ..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరు మగువ కూడా మనిషేనని ఒక్క క్షణం కూడా మర్చిపోరో..
స్త్రీకి గుర్తింపు ఉండాలని ఎవరు మనస్ఫూర్తిగా అనుకుంటారో..
ఎవరు పక్కన ఉంటే మహిళ ధైర్యంగా ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు.. సహచరుడు, ఆత్మీయుడు..
ఒక్క మాటలో చెప్పాలంటే వాడే మగాడు’’