Mahesh Babu : తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్ట్ కు సంబంధించిన కేసుల్లో ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
మహేష్ బాబు సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్ట్ లకు గతంలో ప్రచారం చేసారు. ఈ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేలా మహేష్ బాబు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఇటీవలే ఈడీ సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కి సంబంధించిన ఆఫీసులు, ఇళ్లపై ఈడీ అధికారులు సోదాలు చేసి కొంత నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నిర్వహించిన సోదాల్లో మహేష్ బాబు వీటికి ప్రచారం చేసినందుకు మొత్తం 5.9 కోట్లు తీసుకున్నట్టు తెలిసింది. అందులో 3.4 కోట్లు నగదు రూపంలో, 2.5 కోట్లు ఆన్లైన్ ద్వారా తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో మహేశ్‌బాబుని ఈడీ ఆ సంస్థలు చెల్లించిన పారితోషికంపై ఆరా తీయనుంది. మరి 27న మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరవుతారా లేదా చూడాలి.
వెంగళ్రావునగర్ అడ్రస్సుతో ఉన్న ఓ ప్రాజెక్టులో తమను మోసం చేశారని కొందరు ఈ సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినీ నటుడితో ప్రచారం చేయించారని, అందుకే తాము నమ్మామని ఫిర్యాదులో తెలిపారు. ఈ కేసులో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది.