POCSO : తెలుగు సినీ పరిశ్రమ మరోసారి షాకింగ్ ఆరోపణలతో కుదేలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఘటన మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కలకలం రేపింది. ప్రముఖ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా గుర్తింపు పొందిన కృష్ణ మాస్టర్ మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో గచ్చిబౌలి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటన గత నెలలోనే జరిగింది. మైనర్ బాలిక కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు. ఆరోపణల తీవ్రత దృష్ట్యా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, కృష్ణ మాస్టర్ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతన్ని బెంగళూరులోని తన అన్న నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రిమాండ్‌కు తరలించి కంది జైలులో ఉంచారు.
Grey Zone Warfare : గ్రే జోన్ వార్‌ఫేర్.. చైనా-పాకిస్తాన్ వ్యూహాలకు భారత్ కొత్త సవాళ్లు
కృష్ణ మాస్టర్ ఇటీవలే వివాహం చేసుకున్నాడు. అయితే అతని వ్యక్తిగత జీవితం కూడా వివాదాల మడుగులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారైనట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇది అతని ప్రవర్తనపై మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఈ కేసుతోపాటు గతంలో అతనిపై వచ్చిన పలు ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను, మహిళలను మోసం చేసినట్లు, తప్పుడు హామీలు ఇచ్చి వంచించినట్లు పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే అప్పట్లో ఈ ఆరోపణలు పెద్దగా దర్యాప్తుకు రాలేదు.
ఇటీవల కాలంలో వరుసగా కొరియోగ్రాఫర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం, ముఖ్యంగా రియాలిటీ షోలలో గుర్తింపు పొందిన వ్యక్తులు ఇలాంటి ఆరోపణలకు గురవడం సినీ పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. పిల్లలు, మహిళల భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మళ్లీ ఉధృతమయ్యాయి.