Honey Singh Divorce : బాలీవుడ్ సింగర్ హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్ విడాకులు తీసుకున్నారు. వీరికి ఢిల్లీలోని ఓ కోర్టు నవంబర్ 7న విడాకులు మంజూరు చేసింది. వాస్తవానికి అంతకుముందు షాలిని తల్వార్ తన భర్త హనీసింగ్‌పై గృహ హింస కేసు పెట్టారు. హనీసింగ్, ఆయన కుటుంబ సభ్యులు కలిసి మెట్టినింటిలో తనను వేధించారని ఆ కేసులో షాలిని ఆరోపణలు చేశారు.దీంతోపాటు భర్త హనీసింగ్ క్రిమినల్ బెదిరింపునకు పాల్పడ్డాడని పిటిషన్‌లో తెలిపింది. అయితే సెటిల్‌మెంట్ తర్వాత గృహహింస కేసును హనీసింగ్ భార్య ఉపసంహరించుకుంది. ఈనేపథ్యంలో ఇక కలిసి ఉండలేమని, విడాకులు మంజూరు చేయాలంటూ భార్యాభర్తలు దాఖలు చేసిన పిటిషన్లతో కోర్టు ఏకీభవించింది. హనీసింగ్ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
తనపై వచ్చిన ఆరోపణలపై హనీసింగ్ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశాడు. “నాపై, నా కుటుంబంపై భార్య షాలిని తల్వార్ చేసిన తప్పుడు ఆరోపణలు విని చాలా బాధ కలిగింది. నేను గతంలో ఎన్నడూ ప్రెస్ నోట్ విడుదల చేయలేదు. ఈసారి మౌనంగా ఉండటం మంచిది కాదని అనిపించింది. నా బాధ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను. షాలిని చేసిన ఆరోపణలు నాకు, నా వృద్ధ తల్లిదండ్రులకు, చెల్లెలికి ఎంతో బాధ కలిగించాయి. వాటి వల్ల నా పరువు, ప్రతిష్ఠ మసకబారింది. నేను ఎంతో కష్టపడి మూవీ ఇండస్ట్రీలో సాధించిన ఇమేజ్ దెబ్బతింది. 2011లో నేను షాలినిని పెళ్లి చేసుకున్నాను. దాదాపు 13 ఏళ్లు నాతో కలిసి జీవితంలో ఆమె ప్రయాణించింది. నా షూట్‌లు, ఈవెంట్‌లు, సమావేశాలలో నాతో కలిసి ఆమె పాల్గొనేది. నాపై ఆమె చేసిన ఆరోపణలను ఖండిస్తున్నాను. ఈ విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉన్నందున ఇంకా ఎక్కువ చెప్పదల్చుకోలేదు’’ అని హనీసింగ్ వివరించారు. ‘‘న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుందని విశ్వసిస్తున్నాను’’ అని ఆయన(Honey Singh Divorce) చెప్పారు.