Site icon HashtagU Telugu

CM KCR : అల్లు అర్జున్‌కి, అవార్డు విన్నర్స్‌కి ప్రత్యేక అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్..

Cm Kcr Appreciate Allu Arjun and other National award Winners

Cm Kcr Appreciate Allu Arjun and other National award Winners

ఉత్తమ ప్రతిభ కనబరిచిన దేశీయ చలన చిత్రాలకు ప్రతీయేటా కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తుందని తెలిసిందే. ఇటీవలే 69వ జాతీయ చలన చిత్ర అవార్డులు(National Film Awards) ప్రకటించారు. ఈసారి తెలుగు సినిమాలు జాతీయ అవార్డుల్లో సత్తా చాటాయి. RRR సినిమాకు దాదాపు 6 అవార్డులు రాగా, ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు అల్లుఅర్జున్(Allu Arjun) అవార్డు గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు. అవార్డులు గెలుచుకున్న వారందరికీ దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా విలక్షణమైన రీతిలో తన అత్యుత్తమ నటన ద్వారా ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలియజేశారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు.

కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు. నాటితరం గొప్ప నటుడు శ్రీ అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన శ్రీ చిరంజీవి వంటి వారి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని అన్నారు.

అదే సందర్భంలో… తమ సృజనాత్మక రచనతో సినీ పాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడు శ్రీ దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ శ్రీ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ శ్రీ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.

తెలుగు చలన చిత్ర రంగం నేడు హైద్రాబాద్ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుతుండడం గొప్ప విషయమని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందుతూ, ఫిల్మ్ ప్రొడక్షన్ లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వ కారణమని సీఎం అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో తెలుగు సినిమా ఇతర భారతీయ సినిమా రంగాలతో పోటీపడుతుండడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే వుంటుందని, విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని కేసీఆర్ మీడియాకు తెలిపారు.

 

Also Read : Surprise Gift For Allu Arjun: అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్ పంపిన రామ్ చరణ్ దంపతులు.. టచ్ చేశారంటూ బన్నీ ఎమోషనల్..!