Site icon HashtagU Telugu

Nandamuri Balakrishna : ఈ విజయాలన్నీ నా తల్లిదండ్రులకు.. అంకితం చేస్తున్నా

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna : తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో ప్రత్యేక సందడి చేశారు. తాజాగా సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుని, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న అనంతరం తొలిసారి ఆయన గ్రామానికి చేరుకోవడంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. బాలయ్య రాగానే గురుకుల పాఠశాల విద్యార్థులు గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వగా, గ్రామ ఆడపడుచులు మంగళహారతులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలయ్య, స్వర్గీయ ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు పుష్పాంజలులు సమర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలకృష్ణ, “పద్మభూషణ్ గౌరవం పొందడం, దేశంలో మొదటి కళాకారుడిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందడం నా వ్యక్తిగత విజయాలు కావు, ప్రజల విజయాలు” అని అన్నారు. అలాగే, “పదవులు నాకు ముఖ్యం కావు… వాటికి నేను అలంకారం అన్న భావన ఎప్పుడూ నాలో ఉంటుంది. ఈ విజయాలను నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాను. తండ్రి, గురువు, దేవుడిగా నాకు అన్నీ ఎన్టీఆరే. ఆయన పాత్రలకు ప్రాణం పోసిన తీరు నాకు ఎప్పటికీ ఆదర్శం. ఎన్టీఆర్ ఉన్నత స్థానానికి వెనుక తల్లి బసవతారకం చేసిన త్యాగాలు మరువలేనివి” అని పేర్కొన్నారు.

BCCI President: బీసీసీఐకి కొత్త అధ్య‌క్షుడు.. రేసులో ఉన్న‌ది వీరేనా?

హిందూపురం ఎమ్మెల్యేగా తన బాధ్యతలను ప్రస్తావిస్తూ, బాలకృష్ణ “రాయలసీమ నా అడ్డా. భగీరథ సంకల్పంతో రాయలసీమకు నీళ్లు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని నిరూపించారు. హిందూపురంలో త్రాగునీటి సమస్య పరిష్కారం నాకు గర్వకారణం. నేడు భౌగోళికంగా హిందూపురం ప్రాధాన్యత సాధించడం ఎన్టీఆర్ ఆశయాలకు నిదర్శనం” అని అన్నారు.

తన చిత్రాల గురించి మాట్లాడుతూ బాలయ్య, “ప్రతి సినిమా ఒక సందేశం ఇవ్వాలనే లక్ష్యంతోనే చేస్తాను. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి నిమ్మకూరుకు వచ్చాను” అని తెలిపారు. అలాగే, “అఖండ 2ని మంచి ఉద్దేశంతో రూపొందించాం. దాన్ని కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించాం” అని వివరించారు.

తెలంగాణలో వరదల కారణంగా రైతులు నష్టపోయిన విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, “తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరస్పరం అండగా నిలబడాలి. అన్నదాతలకు సహాయం చేయాలి” అని పిలుపునిచ్చారు. అలాగే సోషల్ మీడియా వినియోగంపై మాట్లాడుతూ, “ప్రపంచం సోషల్ మీడియా వల్ల కుదించుకుపోయింది. దానిని మంచికే వాడాలి కానీ వినాశనానికి కాదు” అని సూచించారు. నిమ్మకూరులో అభిమానులతో కలిసిన బాలయ్య, ఎన్టీఆర్ ఆశయాలు, తెలుగు ఐక్యత, రాయలసీమ అభివృద్ధి, తన సినీ ప్రయాణం గురించి పంచుకున్న ఆలోచనలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి.

Health Insurance : ఏపీ, తెలంగాణలో బెస్ట్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ ఇవే..!