Babita Vs Aamir Khan : బీజేపీ నాయకురాలు, రెజ్లర్ బబితా ఫోగట్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా లోని భివానీ ప్రాంతానికి చెందిన బబిత.. ‘దంగల్’ మూవీ టీమ్‌తో ముడిపడిన కీలక అంశాన్ని బయటపెట్టారు. బబితా ఫోగట్ పేరుతో ఒక పాత్రను దంగల్ సినిమాలో వాడుకున్నారు. ఆమె పాత్రను నటి సుహానీ భట్నాగర్ చక్కగా పోషించారు. ‘‘మా పేరుతో తీసిన దంగల్ మూవీ రూ.2వేల కోట్లను అమీర్ ఖాన్ అండ్ టీమ్‌కు సంపాదించింది పెట్టింది. కానీ ఆయన మాకు రూ.కోటి ఇచ్చి సరిపెట్టారు’’ అని బబిత గుర్తు చేసుకున్నారు. ‘‘దంగల్ మూవీ సక్సెస్ అయిన తర్వాత మేం అమీర్ ఖాన్ టీమ్‌ను(Babita Vs Aamir Khan) సంప్రదించాం. మా ఊరిలో రెజ్లింగ్ అకాడమీ ఏర్పాటుకు సాయం చేయమని కోరాం. అందుకోసం రూ.5 కోట్ల దాకా ఖర్చవుతుందని చెప్పాం. అయితే వారు అస్సలు స్పందించలేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు బబిత చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :Rs 5 Reward : ముగ్గురు నేరగాళ్ల తలపై రూ.5 రివార్డు.. పోలీసుల సంచలన ప్రకటన
‘‘2010 సంవత్సరంలో ఒక న్యూస్ పేపరులో మా ఫ్యామిలీ గురించి కథనం వచ్చింది. మా ఇంట్లో ముగ్గురు రెజ్లర్లు (మహవీర్, గీత బబిత) ఉన్నారనే విషయాన్ని ఆ కథనంలో ప్రస్తావించారు. దీన్ని చూసి బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మేం చెప్పిన సమాచారం ఆధారంగా ఆయన స్క్రిప్ట్ రెడీ చేయించారు. నేరుగా మా ఇంటికి వచ్చి కలిశారు. ఈ స్టోరీతో సినిమా తీస్తానని మాకు నితేశ్ చెప్పారు. ఆ కథ విని మేం ఎమోషనల్ అయ్యాం. సినిమాలో మా పేర్లకు బదులుగా వేరే పేర్లు వాడుతామని నితేశ్ అన్నారు. దీనికి మా నాన్న అభ్యంతరం చెప్పారు. సినిమా చేస్తే మా పేర్లతోనే చేయమన్నారు. అందుకు ఆయన అంగీకరించారు’’ అని చెప్పుకుంటూ బబితా ఫోగట్ ఎమోషనల్ అయ్యారు.