Site icon HashtagU Telugu

Annapurna Photo Studio: చైతూ ఖాతాలో హిట్ .. ఆకట్టుకుంటున్న అన్నపూర్ణ ఫోటో స్టూడియో

Annapurna Photo Studio

New Web Story Copy 2023 07 22t140844.553

Annapurna Photo Studio: సినిమాలో కంటెంట్ ఉంటే అది స్టార్ హీరో సినిమానా కాదా అనేది ప్రేక్షకులకు అనవసరం. కంటెంట్ ఉన్న సినిమాలని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. సినిమాలో కాస్త కొత్తదనం కనిపిస్తే చిన్న సినిమాల్ని కూడా టాలీవుడ్‌ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. ఇటీవల కాలంలో వచ్చిన అనేక చిన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా విడుదలైన అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కుతుంది. విడుదలకు ముందే సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించింది ఈ చిత్రం. ప్రెస్‌ మీట్‌లు తప్పితే పెద్దగా ప్రమోషన్‌లు గట్రా చేయలేదు. అయినా ఈ సినిమా తొలిరోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

30వెడ్స్21 వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు నటుడు చైతన్య రావు. ఈ సిరీస్ లో తన డీసెంట్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టాడు.అలాగే యూట్యూబ్ వీడియోలు, కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.దీంతో ప్రొడ్యూసర్స్ తనతో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చైతన్య రావు తాజాగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. 1980లో గోదావరి పక్కనున్న కపిలేశ్వరపురం అనే అంద‌మైన ప‌ల్లెటూరిలో సినిమా స్టోరీ సాగుతుంది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. విలేజ్ వాతావరణం .. అక్కడ ఉండే కొన్ని పాత్రలు .. వాళ్ల స్వభావాలు ..మేనరిజాలు ..ప్రేమ ..దానికి వచ్చే అడ్డంకులు .. ఇలాంటి కంటెంట్ తో సినిమా రూపుదిద్దుకుంది.

సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చైతూ గురించి . అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాని తన భుజాలపై వేసుకుని నడిపించాడు. తన కామెడీ టైమింగ్ మరియు ఆకట్టుకునే అమాయకత్వం చూడముచ్చటగా అనిపించింది. హీరోయిన్ లావణ్య కూడా చక్కటి నటన కనబరిచింది. పలు సన్నివేశాల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ తో హీరో హీరోయిన్ ఇద్దరూ చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ చేశారు. ఇక సినిమాలో ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నాచురల్ గా మంచి విజువల్స్ విలేజ్ వాతావరణాన్ని చూపించింది. ఈ సినిమాని డైరెక్టర్ అద్భుతంగ ప్రజెంట్ చేశాడు. అప్పటి మ‌నుషుల్లోని అమాయ‌క‌త్వం, క‌ల్మ‌షం లేని పాత్ర‌లు, అంద‌మైన విజువ‌ల్స్‌.. విన‌సొంపైన సంగీతంతో 80ల కాలాన్ని తెర‌పై డైరెక్టర్ ఆవిష్క‌రించిన తీరు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుంది. మొత్తానికి చిన్న సినిమాగా విడుదలై భారీ విజయం దిశగా దూసుకెళ్తుంది అన్నపూర్ణ ఫోటో స్టూడియో.

Also Read: Varun Tej & Lavanya: వరుణ్–లావణ్య పెళ్లికి ముహూర్తం ఫిక్స్, మెగా పెళ్లి సందడి షురూ!