టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తారక్ అండ్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ మల్టీస్టార్ చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా పలు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్స్ రేట్స్ ఎంతవరకు పెంచుకోవచ్చు అనే విషయంపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఇటీవల మీడియా సాక్షిగా మంత్రి పేర్ని నాని చెప్పారు. ఈ క్రమంలో టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారని, దాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ మూవీ టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశం ఉన్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు.
తాజాగా గురువారం ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన పేర్ని నాని భారీ బడ్జెట్ సినిమా విడుదలైన 10 రోజుల పాటు సినిమా టిక్కెట్ ధరలు పెంచుకోవచ్చని అన్నారు. అయితే సాధారణ ప్రజలకు భారం పడకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. టికెట్ రేట్లు పెంచినా సినిమాను ప్రజలు ఇష్టంతో చూసేలా ఉండాలని పేర్ని నాని అన్నారు. ఇకపోతే టికెట్స్ రేట్ల విషయమై బుధవారం ఆర్ఆర్ఆర్ సినిమా డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్యలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచుకునే వీలుండడంతో జక్కన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కొల్లగొడుతుందో చూడాలి.