తమిళనాడులో విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న జాప్యానికి బీజేపీయే కారణమన్న విమర్శలపై నటి కస్తూరి స్పందించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేని ఆహ్వానించడం గవర్నర్ బాధ్యతని, ఇందులో జాప్యం చేస్తే బీజేపీ పరోక్ష రాజకీయాలు చేస్తోందని ప్రజలు అనుమానిస్తారని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడేలా చూడటమే బీజేపీ సొంత ప్రయోజనాలకు మంచిదని ఆమె పార్టీ నాయకురాలిగా సూచించడం గమనార్హం.
తమిళనాడులో క్షణక్షణానికి మారుతున్న రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దళపతి విజయ్ టీవీకే పార్టీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలిచినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినా మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడం, గవర్నర్ ను విజయ్ మూడుసార్లు కలిసినా అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునే అవకాశం కల్పించకపోవడంతో ఏం జరగబోతోందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే తమిళ రాష్ట్రంలో ఈ రాజకీయ అనిశ్చితికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కారణమని ఓ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై సినీ నటి, బీజేపీ నేత కస్తూరి శంకర్ తాజాగా స్పందించారు.
எந்த தவறும் செய்யாமல் பாஜக பழிக்கு மட்டும் ஏன் ஆளாக வேண்டும் ? ஆனால் இப்பொழுது அதுதான் நிலமை .
தமிழக மக்கள் விஜய்க்கு பேராதரவை அளித்துள்ளனர். தமிழக வெற்றிக் கழகம் (TVK) single largest party யாக உருவெடுத்துள்ளது, எனவே அவர்களை ஆட்சி அமைக்க அழைத்து, சட்டமன்றத்தில் பெரும்பான்மையை…
— Kasturi (@KasthuriShankar) May 7, 2026
ఎలాంటి తప్పు చేయకుండా బీజేపీ ఎందుకు నిందలు పడాలి? కానీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. తమిళనాడు ప్రజలు విజయ్‌కు అఖండమైన మద్దతు ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించింది, కాబట్టి వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునే అవకాశం కల్పించడం గవర్నర్ బాధ్యత. దీన్ని ఆలస్యం చేసే ఏ చర్య అయినా సరే, తమిళ ప్రజలే కాకుండా మిగతా వారు కూడా ఒక రాజకీయ తంత్రంగానే చూస్తారు. దీనికి భారతీయ జనతా పార్టీయే పూర్తి కారణం అనే అనుమానం కలుగుతుంది.
విజయ్ మార్గంలో కలిగించే ఏ అడ్డంకి అయినా సరే, అది రాజ్యాంగపరమైన జాప్యంగా పరిగణించబడదు. అది భారతీయ జనతా పార్టీ చేస్తున్న పరోక్ష రాజకీయంగానే కనిపిస్తుంది. నిజానికి బీజేపీ అలా చేయకపోయినా సరే, అందరూ అలానే అనుకుంటారు. తమిళనాడులో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో తాను అడ్డుపడబోనని ఇప్పటికే స్టాలిన్ గారు స్పష్టం చేశారు. కాబట్టి, ప్రజలు కేవలం బీజేపీని మాత్రమే అనుమానిస్తారు. అందువల్ల, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడాన్ని వేగవంతం చేయడం భారతీయ జనతా పార్టీ సొంత ప్రయోజనాలకే మంచిదని కస్తూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇప్పటికే తమిళనాడు రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ తీరుపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు చేశారు. కమల్ హాసన్, విశాల్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి వంటి వారు.. ఇప్పటి వరకూ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధిక స్థానాల్లో టీవీకే పార్టీ గెలిచిందని, కానీ గవర్నర్ మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా ప్రజా తీర్పును అగౌరవపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ గవర్నర్ వైఖరిని తప్పుబట్టారు. ఇప్పుడు కస్తూరి సైతం గవర్నర్ బాధ్యతను గుర్తు చేయడమే కాకుండా, దీనంతటికీ బీజేపీ కారణమని అనుకునేలా పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయని పేర్కొంది.
కస్తూరి గతేడాది ఆగస్టులో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ సమక్షంలో బీజేపీలో చేరారు. అదే పార్టీలో ఉంటూ ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చూడటం భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలకే మంచిదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కస్తూరి తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా డైలీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. అప్పుడప్పుడు ఆమె వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు.
