Salman Khan : బాలీవుడ్ స్టార్‌హీరో సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగిన వ్యవహారం ఇటీవల కలకలం రేపింది. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురు నిందితులు విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21), అనుజ్ థాపన్ (32)లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టులో హాజరుపర్చిన అనంతరం పోలీసు కస్టడీకి తరలించారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న ఈ ఇద్దరు నిందితుల్లో ఒకడైన అనుజ్ థాపన్ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసు కస్టడీలో ఉండగా అతడు ఆత్మహత్యకు యత్నించడం అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన అనుజ్ థాపన్‌ను వెంటనే పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు.
We’re now on WhatsApp. Click to Join
ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటిపై కాల్పులు జరగడాన్ని సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర సర్కారు కీలక చర్యలు తీసుకుంది. తాజాగా సల్మాన్ ఖాన్‌కు భద్రతను మరింత పెంచింది. ఈ కేసులో నిందితులపై ముంబై పోలీసులు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ను ప్రయోగించారు. ముగ్గురు నిందితుల కస్టడీని ఇటీవల కోర్టు మే 8 వరకు పొడిగించింది. ఈ నిందితుల్లో ఒకరైన అనుజ్ థాపన్ సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులకు ఆయుధాలు అందించినట్లు తెలుస్తోంది. తాజాగా పోలీసు కస్టడీలో ఆత్మహత్యకు యత్నించి చనిపోయింది కూడా అనూజ్ థాపనే.