Unlimited Notes: ఒక్కసారి ఊహించుకోండి.. ఒకరోజు మీరు నిద్రలేచేసరికి మీ దగ్గర గుట్టలు గుట్టలుగా డబ్బు ఉంటే? అంటే ఎంత అంటే ఇక దానికి లెక్కే లేనంత! మీరు ఏం చేస్తారు? చాలామంది విలాసవంతమైన ఇళ్లు, కార్లు, ఖరీదైన గ్యాడ్జెట్లు, బట్టలు, నగలు వంటివి కొంటారు. కానీ ఇప్పుడు అదే డబ్బు దేశంలోని ప్రతి వ్యక్తి దగ్గరా ఉంటే ఏమవుతుందో ఆలోచించండి. ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతుంది. దుకాణాలు ఖాళీ అయిపోతాయి. వ్యాపారాలు మూతపడతాయి. అంతటా గందరగోళం నెలకొంటుంది.
భారత రిజర్వ్ బ్యాంక్ తాను ముద్రించే నోట్ల విలువకు సమానమైన బంగారం లేదా విదేశీ ఆస్తులను రిజర్వ్‌గా ఉంచుతుందని మనం తెలుసుకోవాలి. ఒకవేళ RBI తన రిజర్వుల కంటే ఎక్కువ నోట్లను ముద్రించడం ప్రారంభిస్తే ఆ నోట్ల విలువను చెల్లించడానికి సరిపడా బంగారం, విదేశీ నిధులు ఉండవు. అప్పుడు దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుంది. జింబాబ్వే, వెనిజులా వంటి దేశాల్లో ఇప్పటికే ఇలాగే జరిగింది. అక్కడ విపరీతంగా డబ్బు ముద్రించడం వల్ల వారి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి.
RBI అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రించగలదా?
ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి RBI అపరిమితంగా కరెన్సీని ముద్రించలేదు. డబ్బు ముద్రించడం అనేది ఆర్థిక వ్యవస్థను పెంచడానికి సులభమైన మార్గంగా అనిపించవచ్చు. కానీ దీనివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. సరఫరా-డిమాండ్ మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి RBI అపరిమిత నోట్లను ముద్రించగలదా? అంటే దానికి సమాధానం ‘లేదు’. భారత్‌కు అపరిమిత డబ్బు ముద్రించడం ఎందుకు సరైన ఆప్షన్ కాదో ఇప్పుడు చూద్దాం.
ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం)
దీనిని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీరు 20 రూపాయలకు పెన్ను కొనడానికి దుకాణానికి వెళ్లారు అనుకోండి. అక్కడ కేవలం రెండు పెన్నులే ఉన్నాయి. కానీ ఐదుగురు కస్టమర్లు వాటిని కొనాలనుకుంటున్నారు. అప్పుడు దుకాణదారుడు పెన్ను ధరను 25 రూపాయలకు పెంచుతాడు. ఇప్పుడు ప్రభుత్వం నోట్లు ముద్రించి అందరికీ అదనపు డబ్బు ఇచ్చిందనుకుందాం. ఇప్పుడు ఐదుగురి దగ్గరా డబ్బు ఉంది కాబట్టి అందరూ పెన్నులు కొనగలరు. కానీ దుకాణదారుడు పెరిగిన డిమాండ్‌ను చూసి పెన్ను ధరను 50 రూపాయలు చేస్తాడు. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడికి భారం అవుతాయి.
Also Read: సీఎం రేవంత్ నాయకత్వానికి బ్రహ్మరథం!
కరెన్సీ విలువ పడిపోవడం
ఒక దేశం విపరీతంగా డబ్బు ముద్రించినప్పుడు ఆ దేశ కరెన్సీ విలువ పడిపోతుంది. దీనివల్ల ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది వాణిజ్య లోటును పెంచుతుంది. విదేశీ ఇన్వెస్టర్లకు దేశంపై ఉన్న నమ్మకం తగ్గిపోతుంది.
నియంత్రించలేని ద్రవ్యోల్బణం
తక్కువ వస్తువుల కోసం ఎక్కువ డబ్బు పోటీ పడినప్పుడు ధరలు శరవేగంగా పెరుగుతాయి. దీనివల్ల డబ్బుకు ఉన్న కొనుగోలు శక్తి పడిపోతుంది. జింబాబ్వే, వెనిజులా వంటి దేశాల్లో ఇలాగే జరిగి ఆర్థిక వ్యవస్థలు నాశనమయ్యాయి.
పని చేసే ఆసక్తి తగ్గడం
కష్టపడకుండానే ఉచితంగా డబ్బు దొరికితే, ప్రజలకు పని చేయాలనే కోరిక తగ్గుతుంది. ఉత్పత్తి చేసేవారు తగ్గిపోతే వస్తువులు, సేవల లభ్యత తగ్గిపోతుంది. ఇది ఆర్థిక పరిస్థితిని మరింత దిగజార్చి, డిమాండ్, సరఫరా మధ్య అంతరాన్ని పెంచుతుంది.
డిమాండ్, సరఫరాలో అంతరాయం
వస్తువుల ఉత్పత్తి పెరగకపోయినా, డబ్బు సరఫరా పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగి సరఫరా తగ్గితే ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఇది మార్కెట్‌లో అసమతుల్యతను సృష్టిస్తుంది.
