Starlink : ఎలాన్ మస్క్‌కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్ యొక్క శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవల ప్రాజెక్ట్ అయిన స్టార్‌లింక్, త్వరలో భారత్‌లో అధికారికంగా తన సేవలను ప్రారంభించనున్నది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో ఈ సేవలు అందుబాటులో ఉండగా, భారత్‌లోనూ ఇప్పుడు మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ను చేరవేసే కీలక దశలోకి అడుగుపెట్టింది. భారతదేశంలోని అంతరిక్ష కార్యకలాపాలను ప్రోత్సహించే సంస్థ ఇన్-స్పేస్ (IN-SPACe – Indian National Space Promotion and Authorization Center) స్టార్‌లింక్‌కు 2030 జూలై 7 వరకు చెల్లుబాటు అయ్యే విధంగా ఐదు సంవత్సరాల వాణిజ్య అనుమతిని మంజూరు చేసింది. దీంతో భారత్‌లో సేవలు అందించేందుకు అధికారిక నోచుకోగలిగిన మూడవ శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. ఇంతకు ముందు వన్‌వెబ్ మరియు జియో అనుమతులు పొందిన సంగతి తెలిసిందే.
మారుమూల గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్
స్టార్‌లింక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వంటివి అవసరం లేకుండా, నేరుగా ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ను అందిస్తుంది. జెన్-1 శ్రేణికి చెందిన శాటిలైట్‌ల ఆధారంగా సేవలు ప్రసారం చేయబడతాయి. వీటిలో ప్రతీ శాటిలైట్ మరో శాటిలైట్‌తో లేజర్ టెక్నాలజీ ద్వారా అనుసంధానం అవుతుంది. దీని వల్ల సేవల వేగం మరియు స్థిరత్వం మరింత మెరుగ్గా ఉంటుంది. స్టార్‌లింక్ సేవలు అందించేందుకు భారత్‌లో గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అంతేగాక స్పెక్ట్రమ్ అనుమతులు, భద్రతా ప్రమాణాలు (Security Clearances) వంటి కీలక అంశాలు కూడా పూర్తి చేయాల్సిన పనిలో ఉన్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఈ ఏడాదిలోనే ఈ సేవలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
జియో, ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాలు
భారతదేశంలో విస్తృత సేవలందించేందుకు స్టార్‌లింక్ ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుంది. జియో రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ డివైజ్‌లను విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అలాగే మారుమూల ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవల విస్తరణకు ఎయిర్‌టెల్‌తో సహకారం అందుకోనుంది. ఈ ఒప్పందాల ద్వారా భారత్‌లో దాదాపు అందరికి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో స్టార్‌లింక్ పనిచేస్తోంది.
నేరుగా మొబైల్‌కు ఇంటర్నెట్!
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమంటే, బీఎస్‌ఎన్‌ఎల్ ఇప్పటికే “డైరెక్ట్ టు డివైజ్” పేరుతో పోటీగా ఉన్నప్పటికీ, స్టార్‌లింక్ నూ అదే విధంగా శాటిలైట్ – మొబైల్ నెట్‌వర్క్‌లను అనుసంధానించి, నేరుగా ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ఇంటర్నెట్ అందించే కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా సిగ్నల్ చేరని మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్ కనెక్టివిటీ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది.
ప్యాకేజీలు & ధరలు వినియోగదారుల కోసం స్టార్‌లింక్ పలు ధరల లో ప్యాకేజీలను తీసుకురానున్నట్లు సమాచారం.
స్టాండర్డ్ హార్డ్‌వేర్ కిట్: రూ. 30,000
మినీ హార్డ్‌వేర్ కిట్: రూ. 43,000
ప్రోమోషనల్ ప్లాన్: నెలకు రూ. 900
అన్‌లిమిటెడ్ ప్లాన్: నెలకు రూ. 3,000 వరకు ఉండవచ్చని అంచనా.
ఇలా చూస్తే, స్టార్‌లింక్ భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలకే అవకాశం ఉంది. ప్రధానంగా గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాల వాసులకు ఇది మెరుగైన కనెక్టివిటీ అవకాశాలను అందించనుంది.