Site icon HashtagU Telugu

Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!

Special Trains

Special Trains

Special Trains: దసరా, దీపావళి, ఛట్ పూజ వంటి పండుగలను తమ కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. దీంతో పండగల సందర్భంగా రైల్వేల్లో రద్దీ సహజంగానే పెరుగుతోంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా 12,011 ప్రత్యేక రైళ్లను (Special Trains) నడిపిస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లన్నీ 21 సెప్టెంబర్, 2025 నుంచి 30 నవంబర్, 2025 వరకూ నడుస్తాయి. ఇందులో దక్షిణ మధ్య రైల్వే 973 ప్రత్యేక రైళ్లను నడిపిస్తోంది.

21 సెప్టెంబర్, 2025 నుంచి 30 నవంబర్, 2025 మధ్యన వివిధ జోన్లకు సంబంధించిన స్పెషల్ ట్రైన్స్‌తో కలిపి మొత్తం 2,285 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఇలా గతేడాది ప్రయాణించిన 1,924 రైళ్లతో పోలిస్తే ఈ సంవత్సరం 19% ఎక్కువగా ప్రత్యేక రైళ్లు దక్షిణ మధ్య రైల్వే మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఈ రైళ్లన్నీ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నాయి.

21 సెప్టెంబర్, 2025- 20 అక్టోబర్, 2025 మధ్య నెల రోజుల సమయంలో దక్షిణ మధ్య రైల్వే పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని నడిపిన అదనపు రైళ్లతో కలిపి మొత్తం 1,010 ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇందులో 399 రైళ్లను జోన్ పరిధిలో నడపగా, 611 రైళ్లను ఇతర జోన్లకు నడిపింది. ఇవి గతేడాది ఇదే సమయంలో నడిపిన 684 ప్రత్యేక రైళ్లతో పోలిస్తే 47% ఎక్కువ. ఈ సమయంలో ప్రయాణం సాగించిన రోజువారీ రైళ్లతోపాటుగా ఈ స్పెషల్ ట్రైన్స్ సేవలను దాదాపు 5 కోట్ల మంది సద్వినియోగం చేసుకున్నారు.

Also Read: Bihar Elections: బీహార్ ఎన్నికలు 2025.. తొలి దశలో 467 నామినేషన్లు రద్దు!

గతేడాది ఈ పండుగల సమయంలో 1 అక్టోబర్, 2024 నుంచి 31 అక్టోబర్, 2024 వరకు దాదాపు 4.5 కోట్ల మంది దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్, రెగ్యులర్ ట్రైన్స్ సేవలను పొందారు. ప్రత్యేక రైళ్ళకు అదనంగా రోజువారీ నడుస్తున్న రైళ్లలో ఉన్న వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం 237 అదనపు కోచ్ లను ఆయా రైళ్లకు అనుసంధానించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని నివారించడానికి లింగంపల్లి, హైటెక్ సిటీ, చర్లపల్లి, మల్కాజ్ గిరి వంటి రైల్వేస్టేషన్లలో అదనపు స్టాప్ లను ఏర్పాటు చేశారు. రైల్వేశాఖ అందిస్తున్న సేవల పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పండుగ వేళ భారతీయ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ తదనుగుణంగా అవసరమైన అదనపు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కూడా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

Exit mobile version