Site icon HashtagU Telugu

Satellite Telecom: మనకూ శాటిలైట్‌ టెలికాం.. ఛార్జీ ఎంత ? ఏ కంపెనీలు కనెక్షన్ ఇస్తాయి ?

Internet

Internet

Satellite Telecom: మన దేశంలోనూ త్వరలో శాటిలైట్‌ టెలికాం సేవలు షురూ కానున్నాయి. నేరుగా శాటిలైట్ నుంచే మన ఫోన్‌కు టెలికాం సిగ్నల్‌ను అందించడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. దీనివల్ల సెల్‌ఫోన్ టవర్ల అవసరం తప్పుతుంది. సెల్‌ఫోన్ టవర్లు లేని ప్రాంతాల్లో కూడా దర్జాగా మనం ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు.  ప్రస్తుతానికి శాటిలైట్ కమ్యూనికేషన్  సేవలను అందించేందుకు  భారత ప్రభుత్వం నుంచి కేవలం రెండు సంస్థలకే లైసెన్సు లభించింది.  అవి.. వన్‌వెబ్‌ ఇండియా కమ్యూనికేషన్స్, జియో – ఎస్‌ఈఎస్‌ కమ్యూనికేషన్స్‌.

Also Read :Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?

ఈ కంపెనీలు రెడీ.. 

జియో – ఎస్‌ఈఎస్‌ కమ్యూనికేషన్స్(Satellite Telecom) అనేది ముకేశ్ అంబానీకి చెందిన కంపెనీ. ఈ సేవలను అందించేందుకు లగ్జంబర్గ్ దేశానికి చెందిన ఎస్‌ఈఎస్‌ సంస్థ,  రిలయన్స్‌ జియోతో  చేతులు కలిపింది.ఇక  ఫ్రాన్స్‌కు చెందిన  యూటెల్‌శాట్‌ కంపెనీ మన దేశానికి చెందిన భారతీ ఎయిర్‌టెల్‌  కలిసి సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఈ సంస్థ ద్వారా భారత్‌లో శాటిలైట్ టెలికాం సేవలను అందించనున్నారు.  ఈ సేవలను అందించేందుకు వన్‌వెబ్‌ ఇండియా ఇప్పటికే పలు ఏర్పాట్లు చేసింది. గుజరాత్, తమిళనాడుల్లో బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది. కేంద్ర సర్కారు నుంచి  అనుమతులు రాగానే శాటిలైట్ టెలికాం సేవలను ప్రారంభిస్తారు.  జియో–ఎస్‌ఈఎస్‌ సంస్థ కూడా భారత్‌లోని రెండు ప్రాంతాల్లో బేస్‌ స్టేషన్లను ఏర్పాటు చేసింది.  అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ సంస్థ ఇప్పటికే 100కుపైగా దేశాల్లో శాటిలైట్ టెలికాం సేవలను మొదలుపెట్టింది. ఇది మనదేశంలోనూ లైసెన్స్‌ కోసం అప్లై చేసింది. అమెజాన్‌ గ్రూప్‌కు చెందిన కైపర్‌ సంస్థ కూడా ఈ సేవల రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.

Also Read :Nara Lokesh Warning : తప్పు చేసిన ఏ వైసీపీ నేతను వదిలిపెట్టను – మంత్రి లోకేష్

రీఛార్జ్..  ఎంత రేటు ? 

శాటిలైట్ టెలికాం సేవలు .. మన సాధారణ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల కంటే ఖరీదైనవే. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ కోసం మనం ప్రతినెలా రూ.600 నుంచి రూ.4వేల దాకా ఖర్చు చేస్తున్నాం.  అవసరాన్ని బట్టి రీఛార్జ్ ప్లాన్‌ను ఎంపిక చేసుకుంటున్నాం. అయితే శాటిలైట్ టెలికాం రీఛార్జ్ ప్లాన్లు వీటి కంటే 7 నుంచి 18 రెట్లు ఎక్కువ కాస్ట్లీ. సైన్యం, నావికా దళం, లగ్జరీ హోటళ్లు, కొండ ప్రాంతాల్లోని రిసార్టులకు ఇది ఉపయోగపడుతుంది. ఎయిర్ టెల్‌కు చెందిన వన్ వెబ్ సేవలను వినియోగించుకుంటామని భారత ఆర్మీ ప్రకటించింది. శాటిలైట్ టెలికాం కనెక్షన్‌ను తీసుకునేందుకు మనం సదరు కంపెనీకి చెందిన యాంటెనాను కొనాలి.  దీని ధర ప్రస్తుతం అమెరికా లాంటి దేశాల్లో దాదాపు రూ.8వేల దాకా ఉంది. మన దేశంలో దీని ధర రూ.5వేలలోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్రమంగా రాబోయే కొన్నేళ్లలో తక్కువ ఖర్చుతోనే శాటిలైట్ టెలికాం కనెక్షన్ దొరుకుతుందని అంటున్నారు. యాంటెనాల ధర కూడా తగ్గుతుందని చెబుతున్నారు.