Anil Ambani : ఒక్కొక్కరి లక్కు ఒక్కోలా ఉంటుంది. ఔనన్నా.. కాదన్నా.. ఇదే నిజం అని పెద్దలు చెబుతుంటారు. ఓ వైపు అన్నయ్య ముకేశ్ అంబానీ వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుంటే.. మరోవైపు తమ్ముడు అనిల్ అంబానీ వ్యాపారాలు రోజురోజుకు కుదేలవుతున్నాయి. దేశం గర్వించే స్థాయికి, ఎంతోమందికి ఉపాధిని కల్పించే రేంజుకు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎదిగింది. ఇక ఇదే సమయంలో అనిల్ అంబానీ(Anil Ambani) వ్యాపారాల పరిధి తగ్గుతూపోతోంది. వాటికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా అనిల్ అంబానీకి మరో పెద్ద షాక్ తగిలింది. అనిల్‌కు చెందిన రిలయన్స్ పవర్ లిమిడెట్, దాని అనుబంధ సంస్థలపై సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI) మూడేళ్ల బ్యాన్ విధించింది. రిలయన్స్ పవర్ నకిలీ బ్యాంకు గ్యారంటీలను సమర్పించిందని తేలడంతో బ్యాన్‌ను విధిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో రాబోయే మూడేళ్లలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నిర్వహించే బిడ్డింగ్‌లో పాల్గొనే పెద్ద అవకాశాన్ని రిలయన్స్ పవర్ కోల్పోయింది.
Also Read :Shah Rukh Khan : షారుక్ ఖాన్‌కు హత్య బెదిరింపు.. దుండగుడు ఎవరు అంటే..?
ఈ ఏడాది జూన్ నెలలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ 1 గిగావాట్ సోలార్ పవర్, 2 గిగావాట్ల స్టాండలోన్ బ్యాటరీ ఎనర్జీ సోలార్ సిస్టమ్ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఇందులో రిలయన్స్ పవర్‌కు చెందిన రిలయన్స్ NU BESS అనే అనుబంధ సంస్థ కూడా పాల్గొంది. చివరి రౌండ్ బిడ్డింగ్‌లో ఈ కంపెనీ సమర్పించిన బ్యాంకు గ్యారంటీలను అధికారులు నిశితంగా తనిఖీ చేయగా, అవి నకిలీవని తేలింది. అందువల్లే రాబోయే మూడేళ్ల పాటు తాము నిర్వహించే బిడ్డింగ్‌లలో రిలయన్స్ పవర్ పాల్గొనకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ బ్యాన్ విధించింది. ఈ ఏడాది ఆగస్టులోనే స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబీ’ కూడా అనిల్ అంబానీ, ఆయనకు చెందిన 24 కంపెనీలు, ఆయా సంస్థలకు చెందిన పలువురు ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. నిధుల మళ్లింపునకు పాల్పడ్డారంటూ.. ఐదేళ్ల పాటు స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించకుండా వారిపై సెబీ బ్యాన్ విధించింది. రూ.25 కోట్ల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే పెనాల్టీ వసూలు చేయకుండా అక్టోబర్‌లో సెబీకి సెక్యూరిటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది.