Site icon HashtagU Telugu

Hindenburg Research: ‘అదానీ’ని కుదిపేసిన ‘హిండెన్‌బర్గ్‌’ మూసివేత.. ఎందుకు ?

Hindenburg Research Shut Down Nate Anderson Us Company Adani Group

Hindenburg Research: హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌.. ఈ అమెరికా షార్ట్‌ సెల్లింగ్  కంపెనీ పేరు 2024 సంవత్సరంలో మన దేశంలో మార్మోగిపోయింది. ప్రత్యేకించి ఈ కంపెనీ అదానీ గ్రూపునకు సంబంధించి విడుదల చేసిన అధ్యయన నివేదికలు సంచలనం క్రియేట్ చేశాయి. అందరినీ ఆశ్చర్యపర్చాయి. అయితే ఈ కంపెనీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. తన కంపెనీ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌‌ను మూసేస్తున్నానని కంపెనీ వ్యవస్థాపకుడు నాథన్‌ ఆండర్సన్ ప్రకటించాడు. ఈ మేరకు ప్రకటనతో ఆయన ఓ లేఖను విడుదల చేశారు. తాను కంపెనీని(Hindenburg Research) మూసివేయడం వెనుక బెదిరింపులు, భయాలు, వ్యక్తిగత విషయాలు, అనారోగ్య కారణాలు వంటివి లేవని ఆండర్సన్ స్పష్టం చేశాడు.

Also Read :BrahMos Deal : భారత్‌తో ఇండోనేషియా బిగ్ డీల్.. రూ.3,800 కోట్ల బ్రహ్మోస్ క్షిపణులకు ఆర్డర్ ?

హిండెన్‌బర్గ్‌ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే

‘‘హిండెన్‌ బర్గ్‌ను మూసేయడం గురించి గతేడాది చివరి నుంచి నా కుటుంబం, స్నేహితులు, మా టీమ్‌తో చర్చిస్తున్నాను. చివరకు మూసేయాలనే నిర్ణయానికే వచ్చాను. మేం ఎంచుకున్న ప్రణాళికలు , ఐడియాలు ముగిశాయి. అందుకే ఈ నిర్ణయం’’ అని హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ఆండర్సన్ చెప్పారు. ‘‘విజయవంతమైన కెరీర్‌ ఏదో ఒక రోజు స్వార్థపూరిత చర్యలకు దారితీస్తుందని ఒకరు నాకు చెప్పారు. గతంలో నన్ను నేను నిరూపించుకోవాలని అనుకునేవాడిని. ఇప్పుడు నేను కంఫర్ట్‌ జోన్‌లో ఉన్నానని అనిపిస్తోంది. హిండెన్‌బర్గ్‌ నా జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. కానీ, జీవితానికి సరిపడా చేసిన సాహసం. ఎన్నో సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేశాం. ఇదంతా నాకో ప్రేమకథలా అనిపిస్తోంది’’ అని ఆయన లేఖలో రాసుకొచ్చారు. ‘‘ఇక నేను భవిష్యత్తు కార్యాచరణపై ఫోకస్ చేస్తాను. నా టీమ్ మంచి స్థాయికి చేరుకునేందుకు సాయపడతాను’’ అని ఆండర్సన్ వెల్లడించారు.

Also Read :Bhatti Vikramarka : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తో భట్టి విక్రమార్క భేటీ

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఏం చేస్తుంది ?

  • హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ కంపెనీని అమెరికాలోని న్యూయార్క్‌ కేంద్రంగా 2017లో ఆండర్సన్‌ ప్రారంభించారు.
  • ఆర్థిక రంగంలో ఏర్పడే మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తామని తమ వెబ్‌సైట్‌లో ఈ కంపెనీ తెలిపింది. పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్‌లను ఇది విశ్లేషిస్తుంటుంది. ఫైనాన్షియల్‌ ఫోరెన్సిక్‌ రీసెర్చ్ సేవలను అందిస్తుంది.
  • ఏవైనా కంపెనీల్లో అవకతవకలు, దుర్వినియోగం, రహస్య కార్యకలాపాలు జరిగితే హిండెన్‌బర్గ్ గుర్తిస్తుంది.
  • తమ దగ్గరున్న కీలక సమాచారం ఆధారంగా హిండెన్‌బర్గ్ కంపెనీ షేర్ల షార్ట్‌సెల్లింగ్‌లో కూడా పెట్టుబడులు పెడుతుంది. షేర్లను అధిక ధరకు అమ్మి, తక్కువ ధర వద్ద కొని లాభంతో లావాదేవీని ముగించడాన్ని షార్ట్‌ సెల్లింగ్‌ అంటారు.
  • భారత స్టాక్ మార్కెట్‌‌లోనూ ఈ కంపెనీ షార్ట్ సెల్లింగ్ చేసేది.
  • అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలోని షేర్లలో జరిగిన లావాదేవీలలో అవకతవకలు జరిగాయంటూ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్ సంచలన నివేదికను విడుదల చేసింది.

నాథన్ ఆండర్సన్ ఎవరు ?

నాథన్‌ అండర్సన్‌ అమెరికాలోని కనెక్టికట్‌ యూనివర్సిటీలో అంతర్జాతీయ వాణిజ్యంపై డిగ్రీ చేశాడు. కొన్నాళ్ల పాటు ఇజ్రాయెల్‌లోని జెరూసలెంలో స్వచ్ఛందంగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా సేవలు అందించాడు. ‘‘పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో కూడా ధైర్యంగా ఎలా పనిచేయాలో అక్కడే నేర్చుకున్నాను’’ అని ఆండర్సన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇజ్రాయెల్ నుంచి అమెరికాకు వచ్చిన ఆండర్సన్.. ఫ్యాక్ట్‌ సెట్‌ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేశాడు. తదుపరిగా వాషింగ్టన్‌లో ఉన్న ఒక బ్రోకర్‌ డీలర్‌ దగ్గర పనిచేశాడు. ఈ ప్రక్రియలో స్టాక్ మార్కెట్‌పై, షార్ట్ సెల్లింగ్‌పై ఆండర్సన్ మంచి పట్టు సంపాదించాడు.

Exit mobile version